కరోనా ప్రభావం వల్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వాయిదా పడింది. ఫలితంగా అభిమానులు నిరాశకు గురయ్యారు. కానీ ఐపీఎల్‌ను వాయిదా వేసి బీసీసీఐ మంచి పనే చేసిందని అంటున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్.
"ఇది చాలా మంచి నిర్ణయం. బీసీసీఐకి అభినందనలు. ఎందుకంటే దేశ ప్రజల ఆరోగ్యమే అన్నిటికన్నా ముఖ్యం. కరోనా వైరస్ వ్యాపిస్తుండడం వల్ల ఈ నిర్ణయం ఎంతో ముఖ్యం. ఐపీఎల్ మ్యాచ్‌లను చూసేందుకు వేలాది మంది వస్తారు. హోటల్స్‌లో, ఎయిర్‌పోర్టుల్లో అనేక మంది ఉంటారు. చాలా మంది విమానాల్లో ప్రయాణిస్తుంటారు. కాబట్టి, ఎవరైనా వైరస్ బారిన పడొచ్చు. వాళ్ల నుంచి ఇతరులకు వ్యాపించొచ్చు. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం అభినందించదగ్గది"