స్టువర్ట్ బ్రాడ్ (36 పరుగులు)
ఇటీవలే టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఇంగ్లాండ్ బౌలర్‌గా ఘనత సాధించాడు స్టువర్ట్ బ్రాడ్. అయితే గతంలో ఈ పేసర్ తన కెరీర్లోనే చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు. ఏకంగా ఓవర్లో 36 పరుగులు సమర్పించుకున్నాడు.
అది 2007 టీ20 ప్రపంచకప్.. సెప్టెంబర్ 19న డర్బన్‌లో ఇంగ్లాండ్-భారత్ మధ్య మ్యాచ్. ఆ పోరులో బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదేశాడు టీమ్ఇండియా బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్. ఫలితంగా టీ20ల్లో వేగవంతమైన అర్ధ శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. కేవలం 12 బంతుల్లోనే 50 రన్స్ సాధించాడు. ఈ రికార్డు దాదాపు 13 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉంది. ఆ మ్యాచ్‌లో భారత్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.
శివమ్ దూబే (34 పరుగులు)
టీమ్ఇండియా యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబే అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ల జాబితాలో చోటు పొందాడు. పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులిచ్చిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఫిబ్రవరి 2న.. న్యూజిలాండ్-భారత్ మధ్య ఐదో టీ20 జరిగింది. ఈ మ్యాచ్‌లో 10వ ఓవర్ వేసిన దూబే... మొత్తం 34 పరుగులు ఇచ్చుకున్నాడు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ సీఫెర్ట్-రాస్ టేలర్ చెలరేగి ఆడారు. సీఫెర్ట్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టగా.. టేలర్ రెండు సిక్సర్లు, ఫోర్ బాదేశాడు. అందులో ఒకటి నో బాల్ కాగా.. మరొక సింగిల్ లభించింది. ఈ ఓవర్ తర్వాత దూబేకు మళ్లీ బంతి ఇవ్వలేదు కెప్టెన్ రోహిత్ శర్మ. అయితే మిగతా బౌలర్ల ప్రదర్శన కారణంగా ఈ మ్యాచ్‌లో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.
వేన్ పార్నెల్, ఇజాతుల్లా దవ్లత్జాయ్, స్టువర్ట్ బిన్నీ, మాక్స్ ఓడౌడ్ (32 పరుగులు)
టీ20ల్లో ఒకే ఓవర్లో 32 పరుగులు ఇచ్చిన సందర్భాలు నాలుగుసార్లు నమోదయ్యాయి. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వేన్ పార్నెల్(దక్షిణాఫ్రికా) ఈ చెత్త ఫీట్ నమోదు చేశాడు. ఇతడి బౌలింగ్‌లో జాస్ బట్లర్ తనదైన బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు.
2012, సెప్టెంబర్ 21న ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 32 పరుగులు ఇచ్చుకున్నాడు ఇజాతుల్లా దవ్లత్జాయ్(అఫ్ఘానిస్థాన్).
భారత ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ ఖాతాలోనూ ఇలాంటి చెత్త రికార్డు చేరింది. వెస్టిండీస్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో ఏకంగా ఐదు సిక్సర్లు సమర్పించుకున్నాడు.