టీమిండియా.. ప్రతిష్టాత్మక డే/నైట్ టెస్టు ఆడేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 22-26 మధ్య జరగనున్న ఈ మ్యాచ్‌కు.. మొదటి మూడో రోజులు తలో 50 వేల మందికి పైగా అభిమానులు స్టేడియంకు తరలి వచ్చే అవకాశముందని బంగాల్ క్రికెట్ అసోసియేషన్(కాబ్) భావిస్తోంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకుంది.
"భారత్ తొలి డే/నైట్ టెస్టుకు మొదటి మూడు రోజులు 50 వేల మందికి పైగా హాజరవుతారని భావిస్తున్నాం. ఇంకా డిమాండ్ పెరిగే అవకాశముంది" -బంగాల్ క్రికెట్ అసోసియేషన్
అయితే ఈ మొత్తం సంఖ్యలో 17 వేల టికెట్లు ఆన్లైన్లో విక్రయిస్తారు. అదే విధంగా స్టేడియం మొత్తం నిండిపోయే అవకాశముందని ఓ అధికారి చెప్పారు.
ఈడెన్ గార్డెన్స్‌లో భారత తొలి డే/నైట్ టెస్టు
ఇక్కడ మ్యాచ్‌ను ప్రారంభించే ముందు గంట మోగించే సంప్రదాయం ఉంది. ఈ కార్యక్రమానికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరుకానున్నారు.
ఇందులో భాగంగా భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్, ఒలింపిక్ ఛాంపియన్ అభినవ్ బింద్రా, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు, ఆరు సార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మేరీకోమ్‌లను కాబ్ సత్కరించనుంది. వీరితో పాటే బంగ్లాదేశ్-భారత్ మధ్య 2000లో జరిగిన తొలి టెస్టు సభ్యులను సన్మానించనుంది.