తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆటో నుంచి బీఎమ్​డబ్ల్యూ వరకు.. సిరాజ్​ శెభాష్ - సిరాజ్ బీఎమ్​డబ్ల్యూ

భారత పేసర్​ మహ్మద్​ సిరాజ్ స్వీయ కానుక ఇచ్చుకున్నాడు. ఆస్ట్రేలియాలో అద్భుత ప్రదర్శనకు గుర్తుగా ఓ బీఎమ్​డబ్ల్యూ కారు కొన్నాడు. అతడు ఈ స్థాయికి ఎదగడానికి వెనకాల ఎంతో హృద్యమైన కథ ఉంది.

Mohammed Siraj gifts himself a BMW after memorable tour of Australia
ఆటో నుంచి బీఎమ్​డబ్ల్యూ.. సిరాజ్​ స్వీయ కానుక

By

Published : Jan 22, 2021, 9:31 PM IST

ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని స్వదేశానికి చేరుకున్న సిరాజ్.. తనకు తానే విలువైన బీఎమ్​డబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చుకున్నాడు. సంబంధిత వీడియోను ఇన్​స్టా స్టోరీస్​లో పంచుకున్నాడు. ఆటో డ్రైవర్ కుమారుడు స్థాయి నుంచి సొంత బీఎమ్​డబ్ల్యూ కొనే స్థాయికి చేరడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టులకు బ్యాకప్​ బౌలర్​గా ఎంపికైన సిరాజ్.. ఆ దేశంలో ఉండగానే తన తండ్రి మరణ వార్తను విన్నాడు. క్వారంటైన్​లో ఉన్న అతడిని స్వదేశానికి వెళ్లేందుకు బీసీసీఐ అనుమతించింది. తాను దేశం తరఫున ఆడాలనేది తండ్రి కల అని, దానిని నెరవేర్చిన తర్వాతే ఇంటికి వెళ్తానని బోర్డుకు చెప్పాడు. దానిని నిజం చేస్తూ టెస్టు సిరీస్​ను భారత్​ గెలుచుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. అందరితో శెభాష్ అనిపించుకుంటున్నాడు.

సిరాజ్

తొలి టెస్టులో షమి గాయపడడం వల్లే సిరాజ్​కు జట్టులో చోటు దక్కింది. ఆ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న ఇతడు.. మెల్​బోర్న్​లో 5 వికెట్లు తీసి గెలుపులో సహాయపడ్డాడు. సిడ్నీ మ్యాచ్​లో ఆసీస్​ ప్రేక్షకుల నుంచి జాత్యాంహకార వ్యాఖ్యలు ఎదుర్కొన్నా సరే వాటిని తట్టుకుని నిలబడి, రెండు వికెట్లు తీశాడు. నిర్ణయాత్మక బ్రిస్బేన్​ టెస్టు తొలి ఇన్నింగ్స్​లో ఒక వికెట్​.. రెండో ఇన్నింగ్స్​లో ఐదు వికెట్లు పడగొట్టి భారత్​కు మరపురాని విజయాన్ని అందించాడు. పర్యటన ముగించుకుని స్వదేశానికి రాగానే నేరుగా తన తండ్రి సమాధి వద్దకు వెళ్లి భావోద్వేగానికి లోనయ్యాడు.

సిరాజ్​ తండ్రి హైదరాబాద్​లో ఓ ఆటో డ్రైవర్​. తన కొడుకు తనలా కాకుండా గొప్పగా బతకాలని ఆయన కలలు కన్నారు. సిరాజ్​ క్రికెట్​లో రాణించేందుకు ఆయన అహర్నిశలు శ్రమించారు. ఆసీస్ పర్యటనతో ఆయన కల నిజమైంది. ఇప్పుడు బీఎమ్​డబ్ల్యూ కారు కొన్న సిరాజ్.. దానిని తనకు కానుకగా ఇచ్చుకున్నాడు. ఆటోవాలా కుమారుడి స్థాయి నుంచి బీఎమ్​డబ్ల్యూ యజమాని వరకు సాగిన సిరాజ్ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం.

ఇదీ చూడండి:సిరీస్‌లో తీసిన ప్రతి వికెట్‌ నాన్నకు అంకితం: సిరాజ్‌

ABOUT THE AUTHOR

...view details