వ్యక్తిగత జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని.. ఆ సమయంలో తన కుటుంబ సభ్యులు కంటికి రెప్పలా చూసుకున్నారని టీమ్‌ఇండియా పేసర్ మహ్మద్ షమి వెల్లడించాడు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబయిలోని తన నివాసంలో గత ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంపై షమి ఓ సందర్భంలో మాట్లాడుతూ తానూ జీవితంలో కుంగుబాటుకు గురయ్యానని తెలిపాడు. అయితే, ఇదే విషయమై తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడిన అతడు తన జీవితంలో ఎదురైన ఈ అనుభవాల గురించి ఇలా వివరించాడు.
మీ వ్యక్తిగత జీవితంలో ఎదురైన పరిస్థితుల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు ఇటీవల చెప్పారు. దాన్నుంచి ఎలా బయటపడ్డారు?
షమి:కుంగుబాటు అనేది ఒక సమస్య. దానిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సుశాంత్ సింగ్ లాంటి అద్భుతమైన నటుడు ఇలా ఆత్మహత్య చేసుకోవడం చాలా దురదృష్టకరం. అతను నాకో మంచి స్నేహితుడు. అతని మానసిక పరిస్థితి తెలిసి ఉంటే నేను మాట్లాడేవాడిని. నా విషయంలో కుటుంబ సభ్యులు సహాయం చేశారు. ఆ కష్టతరమైన సందర్భంలో నా వెన్నంటే ఉన్నారు. నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా జీవితంలో పోరాడాలని ధైర్యం చెప్పారు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు.. నేను ఒంటరివాడిని కాదని గుర్తుచేశారు. మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. ఆ సమయంలో నిత్యం ఎవరో ఒకరు మాట్లాడేవాళ్లు. అలాంటి పరిస్థితుల్లో దైవభక్తి కూడా ఉపయోగపడుతుంది. సన్నిహితులతో మాట్లాడటం లేదా కౌన్సెలింగ్ తీసుకోవడంలాంటివి వాటి నుంచి బయటపడేలా చేస్తాయి.