62 బంతుల్లో సెంచరీ.. ఈ టీ20 యుగంలో ఇది చాలా మామూలు విషయం. అందులో సగం బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు ఏబీ డివిలియర్స్. కానీ మూడు దశాబ్దాల ముందు మాత్రం ఇది ప్రపంచ క్రికెట్లో ఓ అద్భుతం! దానిని ఆవిష్కరించిన ఆటగాడు మన అజహరుద్దీన్. పెద్ద లక్ష్యాన్ని ఛేదిస్తూ, జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉండగా అసాధారణంగా పోరాడుతూ అతడు ఆడిన ఆ ఇన్నింగ్స్ ప్రపంచ క్రికెట్‌ను విస్మయానికి గురి చేసింది. ఆ సంగతులేంటో చుద్దాం.
మెరుపు సెంచరీ.. విధ్వంసక ఇన్నింగ్స్ ఇలాంటి మాటలు ఇప్పటి అభిమానులకు అలవాటే.. టీ20 వచ్చాక.. బ్యాటింగ్ వేరే స్థాయికి చేరాక మెరుపు ఇన్నింగ్స్‌లు వస్తూనే ఉన్నాయి.. కానీ 30 ఏళ్ల క్రితమే టీ20 తరహా ఇన్నింగ్స్ ఆడేశాడు మహ్మద్ అజహరుద్దీన్. 1988లో న్యూజిలాండ్‌పై 62 బంతుల్లోనే అజేయ సెంచరీ (108 నాటౌట్; 65 బంతుల్లో 10×4, 3×6) సాధించి సంచలనం సృష్టించాడు. అప్పటికి వన్డేల్లో అదే వేగవంతమైన సెంచరీ. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో నాలుగో మ్యాచ్‌లో అజహర్‌ను ఆపేవాళ్లు లేకపోయారు. ఈ మ్యాచ్‌లో భారత్ లక్ష్యం 279 పరుగులు. ఓ దశలో స్కోరు 133/5. ఇలాంటి స్థితిలో భారత్ చేతులెత్తేసే రోజులవి. ఎవరికీ ఆశల్లేవ్! అభిమానులు ఉస్సూరుమంటున్నారు! ఈ స్థితిలో ఆరో స్థానంలో బరిలో దిగిన అజహర్.. అజయ్‌శర్మ (50)తో కలిసి అద్భుతమే చేశాడు.
మణికట్టు మాయాజాలం
10 బౌండరీలు, 3 మహా సిక్సర్లు.. ఈ షాట్లలో ఎక్కడా ఎడాపెడా బాదుడు లేదు! తనకే సొంతమైన ఫుట్‌వర్క్, తనకే ప్రత్యేకమైన మణికట్టు మాయాజాలంతో అతను చేసిన కళాత్మక విధ్వంసమది! ఆఫ్ స్పిన్నర్లు క్రిస్ కుగెలిన్, జాన్ బ్రాసెవెల్ బౌలింగ్‌లో అతను క్రీజు వదలి ముందుకొచ్చి కొట్టిన సిక్సర్లకు బంతి వెళ్లి స్టేడియం బయట పడింది. అజహర్ ధాటికి పదే పదే బౌండరీ లైన్‌ను ముద్దాడుతుంటే మారిసన్, చాట్‌ఫీల్డ్, స్నెడెన్ అలా చేష్టలుడిగిపోయారు. అంతటి ఒత్తిడిలో.. సగం జట్టు పెవిలియన్ చేరాక .. భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ అజహర్ ఆడిన ఆటకు అభిమానులు పులకించిపోయారు. క్లాసిక్ డ్రైవ్‌లతో 62 బంతుల్లోనే సెంచరీ చేసిన అతను.. పాక్ దిగ్గజ ఆటగాడు జహీర్ అబ్బాస్ (72 బంతుల్లో) పేరిట ఉన్న వన్డే వేగవంతమైన శతకం రికార్డును బద్దలు కొట్టాడు. అజయ్‌శర్మతో కలిసి అజహర్ ఆరో వికెట్‌కు 127 పరుగులు జత చేశాడు. అయితే లక్ష్యానికి చేరువైన సమయంలో వరుసగా అజయ్‌శర్మ, సంజీవ్‌శర్మ (0), చేతన్ శర్మ (0) వికెట్లు కోల్పోవడం వల్ల ఉత్కంఠ నెలకొంది. కానీ పట్టు వదలకుండా జట్టును గెలిపించాడు. అప్పటి బౌలింగ్, నిబంధనలు, మ్యాచ్ పరిస్థితులను బట్టి అజహర్ ఇన్నింగ్స్ ఓ సంచలనమే. ఎనిమిదేళ్ల పాటు నిలిచిన అజహర్ రికార్డును 1996లో జయసూర్య (48 బంతుల్లో) బద్దలు కొట్టాడు. అయితే అజహర్ మెరుపు ఇన్నింగ్స్ చూసే అవకాశం టీవీ వీక్షకులకు లేకపోయింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ వరకు ప్రసారం ఉన్నా.. తర్వాత సాంకేతిక సమస్యలతో భారత ఇన్నింగ్స్ సమయానికి ఆగిపోయింది.
బ్యాట్స్‌మెన్: మహ్మాద్ అజహరుద్దీన్
పరుగులు: 108 నాటౌట్