తానిప్పుడు సరైన ఫామ్‌లో ఉన్నానని టీమ్‌ఇండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమి అన్నాడు. ఐపీఎల్‌లో సంతృప్తికర ప్రదర్శన వల్ల ఆస్ట్రేలియా పర్యటనపై ఒత్తిడి తొలగిపోయిందని పేర్కొన్నాడు. సొంతగడ్డపై కంగారూలను ఢీకొట్టగల ఆటగాళ్లు భారత్‌లో ఉన్నారని వెల్లడించాడు. పంజాబ్ తరఫున ఆడిన షమి దుబాయ్‌లో జరిగిన టీ20 లీగులో 20 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ముంబయితో సూపర్ ఓవర్లో 5 పరుగుల లక్ష్యాన్ని కాపాడి అద్భుతం చేశాడు.
ఐపీఎల్‌తో జరిగిన మేలు ఇదే: షమి - Mohammad Shami
ఐపీఎల్‌లో ప్రదర్శన తనలో ఆత్మవిశ్వాసం పెంచినట్లు వెల్లడించాడు టీమ్‌ఇండియా పేసర్ మహ్మద్ షమి. సొంతగడ్డపై కంగారూలను ఓడించగల ఆటగాళ్లు భారత్‌లో ఉన్నారని అభిప్రాయపడ్డాడు.
"ఐపీఎల్‌లో పంజాబ్ తరఫున చేసిన ప్రదర్శనలు నాలో ఆత్మవిశ్వాసం పెంచాయి. నన్ను సరైన ఫామ్‌లో ఉంచాయి. అందుకే నేనిప్పుడు ఆస్ట్రేలియా పర్యటనకు ఒత్తిడి లేకుండా సన్నద్ధమవుతున్నా. ప్రస్తుతం చాలా సౌకర్యంగా ఉన్నా. లాక్‌డౌన్‌లో బౌలింగ్, ఫిట్‌నెస్‌పై నేనెంతో కష్టపడ్డా. ఐపీఎల్ కచ్చితంగా జరుగుతుందని భావించే అందుకు సిద్ధమయ్యా" అని షమి అన్నాడు.
"ఆస్ట్రేలియాలో మేం సుదీర్ఘ పర్యటన చేస్తున్నాం. ముందు తెలుపు బంతి, తర్వాత గులాబి, ఎరుపు బంతులతో క్రికెట్ ఆడతాం. నేనైతే ఎరుపు బంతిపైనే దృష్టి సారిస్తున్నాం. సరైన లైన్, లెంగ్త్‌లపై పనిచేస్తున్నా. కోరుకున్న లెంగ్తుల్లో బంతి పిచ్ అయ్యేలా చేస్తే ఏ ఫార్మాట్లోనైనా విజయవంతం కావొచ్చు. కావాల్సిందల్లా నియంత్రణ. గత సిరీసులో ఆసీస్‌లో వార్నర్, స్మిత్ లేరు. వారి రాకతో ఆ జట్టు మరింత బలంగా మారింది. అయితే వారిని నియంత్రించగలిగే బౌలర్లు మాకున్నారు. 140 కి.మీ వేగంతో మేం బంతులు వేయగలం. మా రిజర్వు బౌలర్లూ వేగంగా విసరగలరు. ఇక మాకు ప్రపంచస్థాయి బ్యాట్స్‌మెన్ ఉన్నారు" అని షమి పేర్కొన్నాడు.