ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది పాకిస్థాన్. మాంచెస్టర్‌లో మంగళవారం జరిగిన చివరిదైన మూడో టీ20లో ఐదు పరుగుల తేడాతో గెలిచింది. ఫలితంగా 1-1తో సిరీస్ డ్రా అయింది. అంతకు ముందు జరిగిన టెస్టు సిరీస్‌ను 0-1 తేడాతో కోల్పోయింది పాక్.
పాకిస్థాన్ విజయం.. ఇంగ్లాండ్‌తో సిరీస్ డ్రా - పాకిస్థాన్ వర్సెస్ ఇంగ్లాండ్
టీ20 సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో పాక్ ఐదు పరుగుల తేడాతో గెల్చింది. 86 పరుగులు చేసిన మహ్మద్ హఫీజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. తద్వారా సిరీస్ 1-1తో సమమైంది.
పాకిస్థాన్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్
ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరిగిన చివరి టీ20లో టాస్ గెలిచి ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లో పాక్ 4 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. హైదర్ అలీ(54) ఆకట్టుకోగా, హఫీజ్ 86 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
అనంతరం ఛేదనలో ఇంగ్లాండ్ తడబడింది. ప్రారంభం నుంచి వరుసగా వికెట్లు కోల్పోయింది. మొత్తంగా 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు మాత్రమే చేయగలిగింది. మొయిన్ అలీ (61), టామ్ బాంటన్ (46) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు.