తెలంగాణ

telangana

ETV Bharat / sports

హైదరాబాద్​ క్రికెట్​లో తీవ్రస్థాయిలో వర్గపోరు!

హైదరాబాద్‌ క్రికెట్‌ పేరెత్తగానే ఒకప్పుడు గులాం అహ్మద్‌, ఎంఎల్‌ జయసింహ, మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడీ, అబ్బాస్‌ అలీ, అబిద్‌ అలీ, అజహరుద్దీన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ వంటి మేటి క్రికెటర్ల పేర్లు గుర్తొచ్చేవి. కానీ గత కొన్నేళ్లుగా మాత్రం అవ్యవస్థ, అవినీతి, అక్రమాలతోనే వార్తల్లో నిలుస్తోంది హైదరాబాద్‌ క్రికెట్‌. చిన్న స్థాయి క్రికెట్‌ సంఘాలు కూడా చక్కటి పనితీరుతో యువ క్రికెటర్లను వెలుగులోకి తెస్తుంటే.. ఘన చరిత్ర ఉన్న హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) మాత్రం అసలు కర్తవ్యం పక్కన పెట్టేసి వరుస వివాదాలతో రోజు రోజుకూ దిగజారిపోతోంది. తాజాగా అంతర్గత కుమ్ములాటలు హెచ్‌సీఏ ప్రతిష్ఠను మరింతగా మసకబార్చేస్తున్నాయి.

By

Published : Sep 9, 2020, 6:35 AM IST

Mohammad Azharuddin files police complaint against Hyderabad Cricket Association employee for 'verbal abuse'
హైదరాబాద్​ క్రికెట్​లో తీవ్రస్థాయిలో వర్గపోరు!

'నా అజెండా క్రికెట్‌..' హెచ్‌సీఏ ఎన్నికల్లో టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌ నినాదమిది. భారీ అంచనాలు.. ఆకాంక్షల నడుమ గతేడాది హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అతను పగ్గాలు చేపట్టాడు. అయితే అజహర్‌ హెచ్‌సీఏ అధ్యక్షుడయ్యాక హైదరాబాద్‌ క్రికెట్‌ పరిస్థితి ఏమంత మెరుగుపడకపోగా.. ఇంకా దయనీయంగా మారింది. పాలన వ్యవహారాలపై అజహర్‌కు పట్టు చిక్కకపోవడం ఓ సమస్య అయితే.. ఎపెక్స్‌ కౌన్సిల్‌లో ఉన్న వ్యక్తులకు ఏమాత్రం చిత్తశుద్ధి లేకపోవడం వల్ల హైదరాబాద్‌ క్రికెట్‌ భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. బంధుప్రీతి, అక్రమాలు, అవినీతిలో మునిగిపోయిన ఎపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులకు.. హెచ్‌సీఏ వ్యవహారాలపై పట్టు లేని అజహర్‌కు మధ్య విభేదాలు తలెత్తి అవి ఇప్పుడు తార స్థాయికి చేరడం వల్ల పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. కలహాలు, కుమ్ములాటలు నిత్యకృత్యంగా మారి హైదరాబాద్‌ క్రికెట్‌ భవిష్యత్తు అంధకారంగా తయారైంది.

ఆటగాళ్లెక్కడ?

ఆట విషయానికి వస్తే.. అత్యంత దారుణమైన పరిస్థితి హైదరాబాద్‌ది. ఒకప్పుడు దిగ్గజ ఆటగాళ్లను అందించిన హెచ్‌సీఏ పరిధిలో లక్ష్మణ్‌ తర్వాత చెప్పుకోడానికి ఒక్క పెద్ద ఆటగాడు లేడు. ప్రస్తుతం భారత టెస్టు జట్టులో ఉన్న హనుమ విహారి.. ఆంధ్ర రంజీ కెప్టెన్‌ హోదాలో జట్టులో చోటు సంపాదించాడు. హైదరాబాద్‌ క్రికెట్‌ రాజకీయాలు తట్టుకోలేక ఆంధ్రకు వెళ్లిపోయిన విహారి.. అక్కడ రెండేళ్లు నిలకడగా సత్తాచాటి టీమ్‌ఇండియాకు ఎంపికయ్యాడు. ఇప్పుడు హైదరాబాద్‌ జట్టులో విహారి స్థాయి ఆటగాడు కూడా లేడు. నిరుడు రంజీ ట్రోఫీలో ఘోరమైన ప్రదర్శనతో హైదరాబాద్‌ గ్రూప్‌-సికి పడిపోయింది. 8 మ్యాచ్‌ల్లో ఆరింట్లో ఓడి 18 జట్లున్న ఎలీట్‌ గ్రూపులో అట్టడుగు స్థానంలో నిలిచింది.

హైదరాబాద్‌ క్రికెట్లో భవిష్యత్తు లేదని గ్రహించిన సీనియర్‌ ఆటగాడు బవనక సందీప్‌.. గోవాకు తరలి వెళ్లాడు. సీనియర్‌ క్రికెట్‌ ఎప్పుడో గాడి తప్పగా.. జూనియర్‌ విభాగంలోనూ హైదరాబాద్‌ జట్ల ప్రదర్శన తీసికట్టే. అండర్‌-23, అండర్‌-19, అండర్‌-16తో సహా ప్రతి జట్టునూ హెచ్‌సీఏ క్లబ్‌ల కార్యదర్శుల కుమారులు, వారి బంధువుల పిల్లలు, డబ్బున్న వాళ్లతో నింపేయడం వల్ల ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. కొందరు పెద్దలు హైదరాబాద్‌ తరఫున ఆడిస్తామంటూ వేరే రాష్ట్రాల వారికీ ఎర వేస్తున్నారు. వారిని తమ క్లబ్‌ల తరఫున హెచ్‌సీఏ లీగ్స్‌లో ఆడించి హైదరాబాద్‌ జట్లకు ఎంపిక చేయించి ఆడించారన్నది బహిరంగ రహస్యం!

ఐపీఎల్‌లో ఇద్దరే..

దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి దేశవాళీ ఆటగాళ్లు పెద్ద సంఖ్యలో ఐపీఎల్‌లో బరిలో దిగుతున్నారు. అయితే రంజీ ట్రోఫీ, అండర్‌-23, అండర్‌-19 టోర్నీల్లో హైదరాబాద్‌ ప్రదర్శన చూసిన ఫ్రాంచైజీలు ఇటు వైపే తొంగి చూడలేదు. సందీప్‌ సన్‌రైజర్స్‌కు ఎంపికయ్యాడు. పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ బెంగళూరు జట్టులో కొనసాగుతున్నాడు. సొంతంగా ఎదిగిన వీళ్లిద్దరిని మినహాయిస్తే హైదరాబాద్‌ పెద్దలు తయారు చేసిన ఒక్క ఆటగాడు కూడా ఈసారి ఐపీఎల్‌లో లేడు.

క్యురేటర్‌పై కుట్ర!

ఐపీఎల్‌లో వరుసగా మూడుసార్లు ఉత్తమ క్యురేటర్‌గా నిలిచి.. దేశంలోనే అత్యుత్తమ పిచ్‌ల్లో ఒకటిగా ఉప్పల్‌ స్టేడియాన్ని తీర్చిదిద్దిన ఘనత చంద్రశేఖర్‌ సొంతం. అలాంటి వ్యక్తికి ఎనిమిది నెలల వ్యవధిలో రెండుసార్లు జీతం ఆపేశారు. బోనస్‌ కూడా ఇవ్వలేదు. దీని వెనుక ఎపెక్స్‌ కౌన్సిల్‌లో కీలక స్థానంలో ఉన్న ఓ వ్యక్తి ఉన్నట్లు సమాచారం.

అవినీతి ఆరోపణలున్న ఆ వ్యక్తి.. ఉప్పల్‌ స్టేడియం క్యురేటర్‌ పదవిని తన స్నేహితుడికి ఇప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని, అందుకోసం చంద్రశేఖర్‌కు వేధిస్తున్నాడని అంటున్నారు. ఏమాత్రం అనుభవం, అర్హత లేని వ్యక్తి చేతిలో ఉప్పల్‌ స్టేడియం పిచ్‌ ఉంటే.. ఇక్కడ అంతర్జాతీయ, ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరిగినపుడు పిచ్‌కు సంబంధించిన విషయాలు బయటకు వెళ్తే ప్రమాదమని హెచ్‌సీఏ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అంచనాలు అందుకోని అజహర్‌

క్రికెట్‌ను గాడిన పెడతాడని భావించిన హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహర్‌కు అదంత సులువైన విషయం కాదని ఆరంభంలోనే అర్థమైపోయింది. ఆయన మిన్నకుండిపోయాడు. మిగతా ఆఫీస్‌ బేరర్లందరూ ఒక గ్రూపుగా మారి హెచ్‌సీఏపై పట్టు సంపాదించారు. జట్ల ఎంపిక మొదలుకుని కాంట్రాక్టుల కేటాయింపు వరకు అన్ని పనుల్లోనూ కార్యవర్గ సభ్యులు చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలున్నాయి. దీనిపై అభ్యంతరం చెబుతూ వచ్చిన అజహర్‌.. నిరుడు కూచ్‌ బెహార్‌ ట్రోఫీ అండర్‌-19 జట్టు ఎంపిక సమయంలో తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరిచాడు.

కార్యదర్శి ప్రాబబుల్స్‌ను ఎంపిక చేయగా.. అజహర్‌ సొంతంగా మరో జాబితా విడుదల చేశాడు. కోచ్‌నూ ఎంపిక చేశాడు. రెండు జట్లు.. ఇద్దరు కోచ్‌లతో అప్పట్లో పరిస్థితి గందరగోళంగా తయారైంది. తాజాగా అజహర్‌ సొంతంగా అంబుడ్స్‌మన్‌ను ఎంపిక చేయడం వల్ల ఆయనకు, మిగతా ఆఫీస్‌ బేరర్లకు మధ్య విభేదాలు తార స్థాయికి చేరాయి. తదనంతర పరిణామాలు అజహర్‌కు ఆగ్రహం తెప్పించాయి. తనను దూషించినందుకు కోశాధికారి, మాజీ ఉపాధ్యక్షుడిపై అజహర్‌ కేసు పెట్టడం వల్ల గొడవ ఇంకా పెద్దదైంది.

ABOUT THE AUTHOR

...view details