తెలంగాణ

telangana

ETV Bharat / sports

మిథాలీ ట్వీట్​కు బౌండరీ అవతల పడిన నెటిజన్​..!

సెలబ్రిటీలకు సామాజిక మాధ్యమాల్లో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. నెటిజన్లు.. ఏ విషయాన్నైనా ప్రశ్నించడానికి, తప్పు దొరికితే ట్రోలింగ్​ చేయడానికి సిద్ధంగా ఉంటారు. టీమిండియా మహిళా క్రికెటర్​ మిథాలీరాజ్​కు అలాంటి ఓ అనుభవం ఎదురైంది.

By

Published : Oct 16, 2019, 7:58 PM IST

నెటిజన్​ ట్రోలింగ్​కు మిథాలీ స్పెషల్​ కౌంటర్

సెలబ్రిటీలను విమర్శిస్తూ, ట్రోలింగ్​ చేస్తూ నెట్టింట హైలైట్​ అవుదామనికొందరు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి సంఘటనే టీమిండియా మహిళా క్రికెటర్ మిథాలీరాజ్‌ ఎదురైంది. అయితే సామాజిక మాధ్యమాల్లో తనను ఇబ్బంది పెడుతున్న ఓ నెటిజన్‌కు గట్టి సమాధానమిచ్చింది.

ఏం జరిగిందంటే..!

ఇటీవల దక్షిణాఫ్రికాపై 3-0 తేడాతో వన్డే సిరీస్‌ గెలిచారు టీమిండియామహిళలు. ఈ సందర్భంగా దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌... మిథాలీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ట్విటర్‌లో అభినందనలు చెప్పాడు. అందుకు మిథాలీ స్పందించింది.

"చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన క్రికెట్‌ దిగ్గజం తనని అభినందించడం సంతోషంగా ఉంది" అంటూ ఓ ట్వీట్‌ చేసింది​. దీనిపై స్పందించిన ఓ నెటిజన్‌ మిథాలీపై విమర్శలు చేసింది.

"మిథాలీరాజ్‌ మాతృభాష తమిళం అయినా ఎప్పుడూ ఆ భాష మాట్లాడదు. ఇంగ్లీష్‌, తెలుగు, హిందీ భాషల్లోనే మాట్లాడుతుంది" అని ట్రోల్‌ చేసింది. అంతేకాకుండా మిథాలీకి అసలు మాతృభాష రాదని ఎద్దేవా చేసింది.

కౌంటర్​ పడినట్లే..
టీమిండియా మహిళా కెప్టెన్‌ మిథాలీ.. ఆ నెటిజన్​కు సమాధానమిస్తూ... "నా మాతృభాష తమిళమే. నేను ఈ భాష బాగా మాట్లాడుతా. ఒక తమిళ వ్యక్తిగా జీవిస్తున్నందుకు గర్వపడుతున్నా. అన్నిటికన్నా ముఖ్యంగా గౌరవప్రద భారతీయురాలిగా ఉంటా. నా ప్రతి పోస్టుకు స్పందించే మీ మాటలను సలహాలుగా తీసుకొని ముందుకుసాగుతా" అని జవాబిచ్చింది. ఈ సందర్భంగా ఆ నెటిజన్‌కు టేలర్‌ స్విఫ్ట్‌ పాటనూ షేర్‌ చేసింది మిథాలి.

ఈ స్టార్​ క్రీడాకారిణికి అభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది. "మిథాలీ కౌంటర్​కు నెటిజన్​ బౌండరీ అవతల పడింది" అని, విమర్శలు చేసిన నెటిజన్​పై మండిపడుతున్నారు.

ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లో 20 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకుంది మిథాలీ రాజ్​. దక్షిణాఫ్రికాతో తొలి వన్డేతో ఈ మైలురాయిని చేరుకుంది. 1999 జూన్‌ 26న మిథాలీ.. ఐర్లాండ్‌పై వన్డే మ్యాచ్‌ ఆడటం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టింది. 20 ఏళ్ల కెరీర్లో 204 వన్డేలు, 10 టెస్టులు, 89 టీ20లు ఆడింది. వన్డే క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన, పరుగులు చేసిన క్రికెటర్‌ మిథాలీనే. ఆమె టీ20లకు ఇటీవలే రిటైర్మెంట్​ ప్రకటించింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details