భారత మహిళా క్రికెట్ జట్టు కొద్దిరోజుల్లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన క్రికెటర్‌గా కొనసాగుతున్న మిథాలీ రాజ్ అనుహ్య నిర్ణయం తీసుకుంది. టీ20లకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించింది. అనంతరం ఈ విషయంపై స్పందించింది.
"2006 నుంచి టీ20ల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఇప్పుడు ఈ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాను. దేశం తరఫున ప్రపంచకప్ సాధించాలనేది నా కల. అందుకే 2021 వన్డే ప్రపంచకప్ కోసం సిద్ధమవుతున్నాను. నా ప్రతి అడుగులో తోడుగా నిలిచినందుకు బీసీసీఐకి ధన్యవాదాలు". -మిథాలీరాజ్, భారత క్రికెటర్
టీమిండియా మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్
ఈ ఏడాది మార్చి 9న ఇంగ్లాండ్‌తో తన చివరి టీ20 ఆడింది మిథాలీ. ఇప్పటివరకు 89 మ్యాచ్‌లాడిన ఈ ప్లేయర్.. 32 మ్యాచ్‌లకు నాయకత్వం వహించింది. 2364 పరుగులు చేసింది. ఇందులో 17 అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 97. ఇదే కాకుండా మూడు టీ20 ప్రపంచకప్‌ల్లో(2012, 2014, 2016) పాల్గొంది. టీమిండియా మహిళలు ఆడిన తొలి టీ20 మ్యాచ్‌కు(2006లో) ఈమె కెప్టెన్ కావడం విశేషం. ఈ ఫార్మాట్లో 2000 పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి క్రికెటర్ మిథాలీనే.
టీమిండియా మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ భారత్ తరఫున 203 వన్డేలాడిన మిథాలీ.. 51.29 సరాసరితో 6720 పరుగులు చేసింది. 10 టెస్టుల్లో 663 పరుగులు ఈమె ఖాతాలో ఉన్నాయి. ఇందులో ఒక సెంచరీ ఉంది.
ఇది చదవండి: అనితర సాధ్యుడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ