అశ్విన్:
మిషన్ మెల్ బోర్న్ .. మూడు రోజుల ముందే అడిలైడ్‌లో మొదలైంది. ఏదో కాలేజీ వీడ్కోలు కార్యక్రమంలా పాటలు పాడుకుంటూ విరాట్ కొహ్లీని సాగనంపే కార్యక్రమాన్ని టీం మేనేజ్ మెంట్ ఏర్పాటు చేసింది. తనకు పుట్టబోయే బిడ్డ కోసం వెళ్తున్నానని కోహ్లీ అందరితో చెబుతుంటే... మేం మాత్రం ఇప్పుడే 36కు ఆలౌట్ అయ్యాం. మమ్మల్ని వదిలేసి వెళ్లకు అన్నంత జాలిగా అందరం కొహ్లీని చూశాం. టీం ఈవెంట్ ఏర్పాటు చేయటానికి వెనుక కారణాలు చెప్పండి శ్రీధర్..?
శ్రీధర్:
ఈ కార్యక్రమం గురించి మాట్లాడాలంటే ముందు రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పాలి. 36కి ఆలౌటైన రోజు అర్ధరాత్రి 12.30కు ఏం చేస్తున్నారంటూ కోహ్లీ మెసేజ్ పెట్టాడు. ఇంత రాత్రివేళ మేసేజ్ ఏంటని నేను చూస్తున్న సమయంలో రవిశాస్త్రి, భరత్ అరుణ్, విక్రమ్ రాథోడ్‌తో కలిసి కూర్చున్నాను మీరు రండి అన్నాడు. సరేనని వెళ్లాను. మిషన్ మెల్ బోర్న్ అనే మాట అప్పుడే విన్నాను. అప్పుడు రవిశాస్త్రి తీక్షణంగా మాకు అందరికీ ఓమాట చెప్పాడు. ఈ 36ను ఓ బ్యాడ్జ్ లా ధరించండి. ఈ 36 నెంబరే ఇదే జట్టును రేపు గర్వపడేలా చేస్తుంది అంటూ ఉద్వేగ భరితంగా మాట్లాడాడు. దాని తర్వాతే ఓ కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. విరాట్ కొహ్లీ స్థానంలో ఎవరైనా బ్యాట్స్ మన్ తీసుకుంటారు. మనం మాత్రం జడేజాను ఆడిస్తున్నాం అని రవిశాస్త్రి అన్నాడు. ఆ నిర్ణయం.. ఈ సిరీస్ మొత్తంలో హైలైట్‌గా నిలిచే మాస్టర్ స్ట్రోక్.
అశ్విన్:
అవును అద్భుతమైన అర్ధశతకంతో జడేజా దాన్ని నిరూపించుకున్నాడు. కానీ ఎందుకు మ్యాచ్ ముందు రోజు ప్రాక్టీస్ రద్దు చేశారు.?
శ్రీధర్:
ఇది బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఆలోచన. ఇప్పుడు ప్రాక్టీస్ చేయిస్తే ఫ్రస్టేషన్లోకి వెళ్లిపోతారు. మెల్బోర్న్ మ్యాచ్ గురించి అంత తీవ్రంగా ఆటగాళ్లు ఆలోచించకూడదని కోరుకున్నాడు. అతిగా ఆలోచిస్తే మెదడుపై భారంపడుతుంది తద్వారా తెలివిగా ఆడలేరని ఆ నిర్ణయం తీసుకున్నాం. అదే సమయంలో జట్టులో ఎక్కువగా ఎడంచేతి వాటం ఆటగాళ్లను ఆడిద్దామని రవిశాస్త్రి నిర్ణయించారు. ఆసీస్ బౌలర్లు కుడిచేతి వాటం ఆటగాళ్లకు ఎక్కువ అలవాటుపడిపోయి ఉన్నారు కనుక ఎడం చేతి వాటం ఆటగాళ్లను దింపటం ద్వారా వాళ్ల లయను దెబ్బతీయటంతో పాటు మనకు ఎంతో కొంత సానుకూల ఫలితాలు వస్తాయని ఆశించారు. అంతే కాదు ప్రాక్టీస్ రద్దు చేయించి టీం డిన్నర్ ఏర్పాటు చేయాలని హోటల్ సిబ్బందిని కోరారు. నెగటివిటీ ఆటగాళ్లకు దరిచేరకుండా చిన్నపాటి ఆటలు, పాటలతో జట్టు సభ్యులంతా సరదాగా గడిపేలా ప్రణాళికలు రచించాం.
అశ్విన్:
చీటీలపై హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు, క్రికెటర్ల పేర్లు రాయించి డంబ్షెల్ ఆర్ట్స్ ఆడించారు. రవిశాస్త్రి పేరును ఆయన చెప్పలేకపోవటం వల్ల జట్టంతా పగలబడి నవ్వుకున్నాం. పాటలు పాడాం. చాలా సరదాగా గడిపి మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమయ్యాం. టాస్ వేసే సమయం వచ్చింది. గడిచిన పదేళ్లుగా ప్రత్యేకించి మెల్బోర్న్లో టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ తీసుకోవటం మ్యాచ్ గెలవటం పరిపాటి. అదే కొనసాగిద్దామని వెళ్లిన కొత్త కెప్టెన్ రహానె టాస్ ఓడిపోయాడు. టిమ్ పైన్ బ్యాటింగ్ తీసుకుంటామని చెప్పినప్పుడు కోచింగ్ స్టాఫ్ ఆలోచనలు ఏంటి?
శ్రీధర్:
ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాలి. టాస్ వేయటానికి పదినిమిషాల ముందు రవిశాస్త్రి నా దగ్గరకు వచ్చారు. మెల్బోర్న్లో మొదట ఫీల్డింగ్ చేసిన టీం గెలిచి ఎన్ని సంవత్సరాలైంది అని అడిగాడు. నాకు.. అసలు ఎందుకు అడిగాడో అర్థం కాలేదు. అవుట్ ఆఫ్ సిలబస్ ప్రశ్న ఎదుర్కొన్న వాడిలా అలా నిలబడిపోయి ఆఖరి 5టెస్టులు మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచిందని మాత్రం చెప్పాను. కానీ వికెట్ కాసింత తడిగా ఉండటం వల్ల వాళ్లు బ్యాటింగ్ తీసుకున్నా మనకి పర్లేదు అని అనుకున్నాం.
అశ్విన్: