ఇంగ్లాండ్‌తో ఈ నెల 23న ప్రారంభమవనున్న వన్డే సిరీస్ కోసం జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఇటీవలే టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్‌కు వన్డేల్లోనూ అవకాశం కల్పించింది. అలాగే టీ20ల్లో చాలాకాలంగా స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్న కృనాల్ పాండ్యాతో పాటు ఇప్పటివరకు జాతీయ జట్టుకు ఆడని ప్రసిద్ధ్ కృష్ణను ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో అసలు వీరిని తీసుకోవడానికి గల కారణాలను తెలుసుకుందాం.
కృనాల్ పాండ్యా
29 ఏళ్ల కృనాల్ పాండ్యా ఆల్‌రౌండర్‌గా ఇప్పటికే టీ20ల్లో జట్టుకు సేవలందిస్తున్నాడు. బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించగలడు. ఇంగ్లాండ్ పేస్ దళానికి చివర్లో తన బ్యాటింగ్ మెరుపులతో కృనాల్ చెక్ పెట్టగలడని యాజమాన్యం భావిస్తోంది. అలాగే స్పిన్ అంటే ఆందోళన వ్యక్తం చేసే ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌కు ఈ ఎడమచేతి స్పిన్నర్ మరో పరీక్షగా మారే అవకాశం ఉంది. టెస్టుల్లో ఎడమచేతి స్పిన్నర్ అక్షర్ పటేల్ వారిని ఎంతగా ఇబ్బందిపెట్టాడో తెలిసిందే. ఇప్పుడు కృనాల్ కూడా అలాంటి ప్రదర్శనే చేయగలడని సెలక్షన్ కమిటీ భావిస్తోంది. టీ20 ప్రపంచకప్ దగ్గర పడుతోన్న క్రమంలో హార్దిక్ పాండ్యాకు కొంత విశ్రాంతినిచ్చే అవకాశమూ లేకపోలేదు. దీంతో కృనాల్‌ను తుదిజట్టులోకి తీసుకోవాలనేది బోర్డు ముందున్న మరో ఆలోచన. ఈ ఏడాదే వెన్నునొప్పికి చికిత్స తీసుకున్న హార్దిక్‌కు మరో గాయం కాకూడదని అనుకుంటున్నారు. దీంతో కృనాల్ వారికి మంచి ఆల్‌రౌండర్ ఆప్షన్‌గా కనిపిస్తున్నాడని విశ్లేషకుల అంచనా.