తెలంగాణ

telangana

ETV Bharat / sports

'విరాట్​ ప్రోత్సాహం కొత్త ఉత్సాహాన్నిచ్చింది ' - మయాంక్‌ అగర్వాల్‌

ఇండోర్​ వేదికగా బంగ్లాదేశ్​తో జరిగిన తొలి టెస్టులో.. ఇన్నింగ్స్​ 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది భారత జట్టు. టీమిండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ డబుల్ సెంచరీ చేసి గెలుపులో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్​ అనంతరం మాట్లాడిన మయాంక్​.. సారథి విరాట్​ కోహ్లీ ప్రోత్సాహం గురించి చెప్పాడు.

'విరాట్​ ఇచ్చే ప్రోత్సాహం చాలు దంచేయడానికి..'

By

Published : Nov 16, 2019, 9:01 PM IST

ఇండోర్​ వేదికగా బంగ్లాదేశ్​తో జరిగిన తొలిటెస్టులో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ కెరీర్‌లో రెండో ద్విశతకాన్ని సాధించాడు మయాంక్​ అగర్వాల్​. కెరీర్​లో 243 పరుగుల అత్యుత్తమ స్కోరును నమోదు చేశాడు. మ్యాన్ ఆఫ్​ ద మ్యాచ్​గా నిలిచాడు. అనంతరం మాట్లాడుతూ భారత సారథి విరాట్ కోహ్లీ అందించిన ప్రోత్సాహం వల్లే బాగా ఆడినట్లు చెప్పుకొచ్చాడు.

" ఇప్పుడున్న సంతోషం మరింత కాలం ఉంటుందని ఆశిస్తున్నా. భారత్​ తరఫున ప్రాతినిధ్యం వహించాలనుకున్న నా కల నెరవేరింది. కెరీర్‌ ఆరంభంలోనే గొప్పగా రాణించడం సంతోషంగా ఉంది. విరాట్‌ కోహ్లీ వంటి ఆటగాడు నన్ను ప్రోత్సహించడం ఎంతో అద్భుతంగా ఉంటుంది. నేను 150 పరుగులు చేసినప్పుడు కోహ్లీ ద్విశతకం సాధించాలని ప్రోత్సహించాడు. అతడి మద్దతు కొత్త ఉత్సాహానిచ్చింది."
- మయాంక్​ అగర్వాల్​, భారత టెస్టు ఓపెనర్​

ఇటీవల దక్షిణాఫ్రికాపై తొలి ద్విశతకం చేసిన మయాంక్​... 12 ఇన్నింగ్స్‌ల్లోనే మరో డబుల్‌ సెంచరీ చేసి ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు.

ఒక్కడు జట్టుతో సమానం..

ప్రత్యర్థి జట్టు చేసిన స్కోరు కంటే ఎక్కువ పరుగులు సాధించిన టీమిండియా ఆరో బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు మయాంక్‌ అగర్వాల్‌.
బంగ్లా జట్టు... తన తొలి ఇన్నింగ్స్‌లో 150, రెండో ఇన్నింగ్స్‌లో 213 పరుగులు మాత్రమే చేసింది. ఏ ఇన్నింగ్స్‌లోనూ మయాంక్‌ (243) స్కోరుని దాటలేకపోయింది​.

భారత ఆటగాడు ప్రత్యర్థి కాలం
వినూ మన్కడే (231) న్యూజిలాండ్‌ (209, 219) 1955/56
రాహుల్‌ ద్రవిడ్‌ (270) పాకిస్థాన్‌ (224, 245) 2003/04
సచిన్ తెందూల్కర్‌ (248) బంగ్లాదేశ్‌ (184, 202) 2004/05
విరాట్‌ కోహ్లీ (213) శ్రీలంక (205, 166) 2017/18
రోహిత్‌ శర్మ (212) దక్షిణాఫ్రికా (162, 133) 2019/20
మయాంక్‌ అగర్వాల్‌ (243) బంగ్లాదేశ్‌ (150, 213) 2019/20

భారత బౌలర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 213 పరుగులకే కుప్పకూలింది. భారత జట్టు ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో భారీ విజయం ఖాతాలో వేసుకుంది. రెండు టెస్టుల సిరీస్​లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది కోహ్లీసేన. రెండో టెస్టులో తొలిసారి ఇరుజట్లు ఫ్లడ్​లైట్​ వెలుతురులో ఆడనున్నాయి. ఈడెన్​ గార్డెన్ వేదికగా ఈనెల 22-26 వరకు ఈ టెస్టు మ్యాచ్​ జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details