బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ బ్యాట్స్‌మన్ చెలరేగి ఆడారు. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 493 పరుగులు చేసింది టీమిండియా. మయాంక్ అగర్వాల్(243) ద్విశతకంతో అదరగొట్టగా.. రహానే(86), జడేజా(60*), పుజారా(54) అర్ధశతకాలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో అబు జాయెద్ 4 వికెట్లు తీయగా.. ఎబడాత్ హొస్సేన్, మెహదీ హసన్ చెరో వికెట్ తీశారు.
ఓవర్ నైట్ స్కోరు 86/1తో రెండోరోజు ఆట ప్రారంభించిన టీమిండియా నిలకడగా ఆడింది. అర్ధశతకం పూర్తి చేసిన పుజారాను అబు జాయేద్ ఔట్ చేశాడు. అనంతరం విరాట్ కోహ్లీనీ ఎల్బీడబ్ల్యూ చేసి డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు.
ఇలాంటి పరిస్థితుల్లో రహానేతో కలిసి ఇన్నింగ్స్ నడిపించాడు మయాంక్. వీరిద్దరూ కలిసి 190 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం జడేజాతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు మయాంక్. అతడితో 121 పరుగులు జోడించాడు.
ద్విశతకంతో సత్తాచాటిన మయాంక్..
మయాంక్ అగర్వాల్ ద్విశతకంతో ఆకట్టుకున్నాడు. 304 బంతుల్లో రెండు వందల పరుగుల మార్కును అధిగమించాడు. ఇందులో 28 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. మయాంక్ సిక్సర్‌తోనే డబుల్ సెంచరీ మార్కు సాధించడం విశేషం.
ద్విశతకం అనంతరం మరింత రెచ్చిపోయాడు మయాంక్ అగర్వాల్. ఎడపెడా బౌండరీలు.. సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. మెహదీ హసన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టిన భారత ఓపెనర్ తర్వాతి బంతికి షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్లో అబు జాయేద్‌కు క్యాచ్ ఇచ్చాడు.
చివర్లో జడ్డూ, ఉమేశ్ యాదవ్ మెరుపులు..
రెండో రోజు ఆట ముగుస్తుందనుకున్న తరుణంలో రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా ఉమేశ్ యాదవ్ దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లోలా.. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 10 బంతుల్లో 25 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. ఇందులో 3 సిక్సర్లు ఓ ఫోర్ ఉన్నాయి.
ఆరంభం నుంచి వేగంగా ఆడిన రవీంద్ర జడేజా.. చివర్లో మరింత ధాటిగా ఆడాడు. 76 బంతుల్లో 60 పరుగులు చేసి క్రీజులో కొనసాగుతున్నాడు. ఇందులో ఆరు ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.
టెస్టు కెరీర్లో ఇప్పటివరకు మూడు శతకాలు చేశాడు మయాంక్. ఇందులో రెండు డబుల్ సెంచరీలు ఉండడం విశేషం. ఇటీవల విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 215 పరుగులు చేశాడీ టీమిండియా ఓపెనర్.
తక్కువ ఇన్నింగ్స్‌ల్లో(12) డబుల్ సెంచరీ చేసిన ఆటగాళ్లల్లో మయాంక్ అగర్వాల్ రెండో స్థానంలో ఉన్నాడు. 5 ఇన్నింగ్స్‌ల్లో ద్విశతకం చేసిన వినూ మాన్కడ్(1955) మొదటి స్థానంలో ఉన్నాడు.