ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ద్విశతకం(243)తో చెలరేగాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మెహాదీ హసన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు.
రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 493 పరుగులు చేసింది. బంగ్లా కంటే కోహ్లీసేన 343 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండు రోజు ఆట పూర్తయిన తర్వాత మాట్లాడిన మయాంక్... తన ఆలోచన ధోరణి మార్చుకున్న తర్వాత పరుగుల దాహం పెరిగిందన్నాడు.
"భయాన్ని పోగొట్టుకున్నా. ఆలోచన ధోరణిని మార్చుకున్నా. అప్పటి నుంచి పరుగుల దాహం మొదలైంది. క్రీజులో కుదురుకున్నాక భారీ స్కోరు సాధించాలని భావిస్తా. అరంగ్రేటం చేసిన మెల్‌బోర్న్ టెస్టు ఎంతో ప్రత్యేకం. రహానేకు టెస్టు క్రికెట్‌లో ఎంతో అనుభవం ఉంది. అతడు ఎంతో సహకరించాడు. భాగస్వామ్యాన్ని నెలకొల్పాలని ప్రణాళిక వేసుకున్నాం. భారీ స్కోరు సాధించగలిగాం" -మయాంక్ అగర్వాల్, భారత క్రికెటర్