తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అందుకే మ్యాక్స్​వెల్​ను ఫ్రాంచైజీలు వదిలేస్తున్నాయి'

ఆస్ట్రేలియా విధ్వంసకర క్రికెటర్ మ్యాక్స్​వెల్ ఐపీఎల్​లో తరచూ విఫలమవడం వల్లే అతడిని ఫ్రాంచైజీలు వదిలేస్తున్నాయని తెలిపాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. ప్రతి ఫ్రాంచైజీ అతడికి స్వేఛ్ఛనిస్తుందని వెల్లడించాడు.

By

Published : Apr 7, 2021, 1:33 PM IST

Maxwell
మ్యాక్స్​వెల్​

ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌కు అన్ని ఫ్రాంచైజీలు స్వేచ్ఛనిచ్చాయని మాజీ క్రికెటర్‌ గౌతమ్ గంభీర్‌ అన్నాడు. ప్రదర్శన సరిగా లేదు కాబట్టే అతడిని వదిలేస్తున్నాయని వెల్లడించాడు. ఈసారి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫునైనా రాణించాలని కోరుకుంటున్నానని తెలిపాడు.

"ఐపీఎల్‌లో మ్యాక్స్​వెల్ విజయవంతం అవ్వలేదు. నిజం చెప్పాలంటే, అతడు రాణిస్తే ఇన్ని ఫ్రాంచైజీలకు ఆడేవాడు కాదు. అతడిని నిలకడలేమి వేధిస్తోంది. అంతకుముందు ఆడిన ఫ్రాంచైజీలు అతడికి స్వేచ్ఛనివ్వలేదు అనేందుకు వీల్లేదు. ఎందుకంటే దిల్లీకి ఆడినప్పుడు అతడికి అపరిమిత స్వేచ్ఛను ఇచ్చారు. ఎక్స్‌-ఫ్యాక్టర్‌ అనే ఉద్దేశంతో అన్ని ఫ్రాంచైజీలు, కోచ్‌లు అతడు రాణించేందుకు సరైన అవకాశాల్నే ఇస్తాయి."

-గంభీర్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్

"దురదృష్టకరం ఏంటంటే అతడికి ఎన్నో అవకాశాలు ఇచ్చినా 2014 మినహాయించి ఎప్పుడూ విధ్వంసాలు సృష్టించలేదు. అలా చేసుంటే ఫ్రాంచైజీలు వదిలేయవు కదా. కోల్‌కతాలో ఆండ్రీ రసెల్‌ను చూడండి. ఎంతో కాలంగా ఆడుతున్నాడు. ఫ్రాంచైజీలు మ్యాక్సీని వదిలేస్తున్నాయంటే అతడు ఆడటం లేదు కాబట్టే. దీనర్థం అతడికి ఏ ఫ్రాంచైజీలోనూ స్థిరత్వం లేదనే. ఆసీస్‌ తరఫున అదరగొడుతున్నాడు కాబట్టే ఏటా భారీ ధర పలుకుతున్నాడు. ఐపీఎల్‌లో అందరి కన్నా ఎక్కువ స్వేచ్ఛ అతడికే లభించింది. ఆర్‌సీబీ అతడు రాణించాలని కోరుకుంటోంది. అలా జరగాలని ఆశిద్దాం" అని గంభీర్‌ తెలిపాడు.

పంజాబ్‌ను 2014లో ఫైనల్‌కు తీసుకెళ్లిన మ్యాక్సీ ఆ తర్వాత ఎప్పుడూ ఆ స్థాయిలో ఆడకపోవడం గమనార్హం. ముంబయి, దిల్లీ వంటి జట్లకు మారాడు. వాళ్లు వదిలేయడం వల్ల గతేడాది మళ్లీ పంజాబ్‌కే ఆడినా ఒక్క సిక్సరూ బాదలేదు. ఆస్ట్రేలియా తరఫున విధ్వంసం సృష్టించిన అతడిని ఈ సారి బెంగళూరు భారీ ధరపెట్టి కొనుగోలు చేసింది. నెట్స్‌లోనైతే భారీ హిట్టింగ్‌ చేస్తూ కనిపిస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details