సాధారణంగా మిడ్ ఫీల్డ్, బౌండరీ లైన్ వద్ద బంతిని పట్టుకోవడం సులభం. ఎందుకంటే బ్యాట్స్‌మెన్ కొట్టిన బంతి వేగం కొంచెం మందగించే అవకాశం ఉంటుంది. ఫీల్డర్లకు క్యాచ్ పట్టేందుకు సమయం దొరుకుతుంది. కానీ స్లిప్‌లో ఫీల్డింగ్ కొంచెం కష్టతరమైనది. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ మాథ్యూ వేడ్ క్యాచ్ పట్టిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఆస్ట్రేలియాలో జరుగుతున్న షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో న్యూసౌత్ వేల్స్, టాస్మేనియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో దాదాపు నేలపాలైందనుకున్న క్యాచ్‌ను చాకచక్యంగా అందుకున్నాడు వేడ్.
జాక్సన్ బర్డ్ బౌలింగ్‌లో న్యూ సౌత్ వేల్స్ ఆటగాడు డేనియల్ ఇచ్చిన క్యాచ్‌ను రెండో స్లిప్‌లో ఉన్న అలెక్స్ డూలాన్ వదిలేశాడు. ఆ బాల్ నేల మీద పడేలోపే... క్షణాల్లో డైవ్ చేసి దాన్ని అందుకున్నాడు మాథ్యూ. దీనిపై క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంత మంచి క్యాచ్ పట్టడానికి అతడి వికెట్ కీపింగ్ స్కిల్స్ కూడా ఓ కారణం.