బంగ్లాదేశ్ పేసర్ మష్రఫే మొర్తాజా వన్డే జట్టు కెప్టెన్ పదవికి రాజీనామా చేశాడు. ఈ విషయాన్ని గురువారం వెల్లడించాడు. ఈ నేపథ్యంలో పరిమిత ఓవర్లకు త్వరలోనే అతడు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. శుక్రవారం జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్ కెప్టెన్గా మొర్తాజాకు చివరి వన్డే అవుతుంది.
"ఇన్నాళ్లు నాపై నమ్మకముంచిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు. ఆటగాడిగా జట్టులో స్థానమిస్తే ఉత్తమ ప్రదర్శన చేస్తా."
- మష్రఫే మొర్తాజా, బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్
బంగ్లాదేశ్ జట్టు కాంట్రాక్ట్ నుంచి ఈ ఏడాది జనవరిలో తప్పకున్నాడు మొర్తాజా. దీనివల్ల వచ్చే ప్రపంచకప్ దృష్ట్యా యువకులకు అవకాశం దొరకుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇప్పటికే అతడి మోకాలికి ఏడు సార్లు ఆపరేషన్లు జరిగిన కారణంగా ఎక్కువకాలం జట్టులో కొనసాగలేనని పరోక్షంగా సూచించాడు.
మొర్తాజా 87 మ్యాచ్ల్లో జట్టుకు సారథ్యం వహించి 49 సార్లు విజయాన్ని అందించి అత్యంత విజయవంతమైన సారథిగా ఘనత సాధించాడు. 2018లో జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికల్లో అవామీ లీగ్ పార్టీ తరఫున పోటీ చేసి పార్లమెంట్ అభ్యర్ధిగా గెలుపొందాడు.
ఇదీ చూడండి.. ఈ పదవి నాకు దక్కిన గౌరవం: జోషీ