పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడేందుకు కుమార సంగక్కర నేతృత్వంలోని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) జట్టు సిద్ధమవుతోంది. ఫిబ్రవరిలో పర్యటనకు 12 మందితో జట్టును తాజాగా వెల్లడించింది ఎమ్‌సీసీ. ఈ జట్టుకు సంగక్కర సారథి కాగా... ఇంగ్లాండ్ క్రికెటర్ రవి బొపారా వంటి సీనియర్లు బరిలోకి దిగనున్నారు.
బ్రతిమలాడితే ఒప్పుకున్నారు!
2009లో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రదాడి జరిగింది. ఆ ప్రమాదంలో పలువురు క్రికెటర్లకు గాయాలయ్యాయి. ఈ ఘటన తర్వాత ఏ విదేశీ జట్టు ఆ దేశంలో అడుగుపెట్టేందుకు సాహసించలేదు. అయితే 2019లో మళ్లీ లంక జట్టే ఆ దేశంలో పర్యటించింది. ఆ సమయంలో లంకేయులను ప్రధానికి సమానమైన భద్రతతో తీసుకెళ్లడం పెద్ద చర్చనీయాంశమైంది. అయితే ఎన్ని చేసినా ఆ దేశంలో క్రికెట్ ఆడేందుకు అగ్ర దేశాలు అంగీకరించట్లేదు. గాడి తప్పిన క్రికెట్‌ను పునరుద్దరించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది పాక్ బోర్డు.
ఇందులో భాగంగానే ఓ టోర్నీ ఆడాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చేసిన విజ్ఞప్తికి ఎంసీసీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఎంసీసీ నుంచి ఒక జట్టును దాయాది దేశానికి పంపడానికి ఒప్పుకొంది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పాకిస్థాన్ తరహా దేశాల్లో క్రికెట్‌ను బ్రతికించడం చాలా ముఖ్యమని భావించిన ఎమ్‌సీసీ.. పాక్‌లో పరిస్థితులు బాగానే ఉన్నాయనే చెప్పాలనే ఉద్దేశంతో ఎమ్‌సీసీ అక్కడకు వెళ్తోంది.
>> పాక్ పర్యటనలో ఎంసీసీ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో రెండు మ్యాచ్‌లను పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) జట్లు లాహోర్ క్వాలండర్స్, ముల్తాన్ సుల్తాన్స్‌తో తలపడనుంది. ఆఖరి మ్యాచ్‌ను పాక్ దేశవాళీ టీ20 మ్యాచ్ విజేత నార్తరన్‌తో పోటీపడుతుంది ఎమ్‌సీసీ.
పాక్‌కు వెళ్లే ఎమ్‌సీసీ జట్టు ఇదే...
కుమార్ సంగక్కర(కెప్టెన్), రవి బొపారా, మైఖేల్ బర్జెస్, ఒలివర్ హానన్, ఫ్రెడ్ క్లాసెన్, మైఖేల్ లీస్క్, అర్రోన్ లిల్లీ, ఇమ్రాన్ ఖయ్యూం, విల్ రోడ్స్, సఫ్యాన్ షరీఫ్, వాన్ డెర్ మెర్వీ, రాస్ వైట్లీ