గతేడాది జరిగిన యాషెస్ టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్ స్మిత్‌కు కాంకషన్‌గా జట్టులోకి వచ్చాడు లబుషేన్. అవకాశాన్ని రెండు చేతులతో అందుకొని, ఆసీస్‌కు రెగ్యులర్ బ్యాట్స్‌మన్‌గా స్థిరపడ్డాడు. ఇప్పుడు అతడిపై దిగ్గజ సచిన్ తెందుల్కర్ ప్రశంసలు వర్షం కురిపించాడు. అతడి ఫుట్ వర్క్ ఎంతో అద్భుతంగా ఉందన్నాడు. "మార్నస్ లబుషేన్ ఫుట్ వర్క్ ఎంతో అద్భుతంగా ఉంది. నా శైలిలోనే ఆడుతున్నాడు. అతడిలో ఏదో దాగి ఉంది" అని సచిన్ అన్నాడు. దీనిని ఐసీసీ ట్వీట్ చేసింది. లబుషేన్‌కు దక్కిన ఉత్తమ ప్రశంసలల్లో ఇదే అత్యుత్తమని పేర్కొంది.
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ మార్కస్ లబుషేన్
ఆస్ట్రేలియాలోని కార్చిచ్చు బాధితుల సహాయార్థం పాంటింగ్ ఎలెవన్ జట్టుకు సచిన్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అయితే దీని గురించి తొలుత ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్‌లీ తనతో చెప్పాడని సచిన్ అన్నాడు.
"బ్రెట్ లీ నుంచి నాకో సందేశం వచ్చింది. కెవిన్ రాబర్ట్స్ (ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సీఈవో) నీతో మాట్లాడాలనుకుంటున్నారని చెప్పాడు. ఆసీస్‌కు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆసీస్‌తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. 18 ఏళ్లకే ఆసీస్ పర్యటనకు వచ్చి దాదాపు నాలుగు నెలలు ఇక్కడే ఉన్నాను. కెరీర్‌లో ఎదగడానికి ఈ పర్యటన ఎంతో ఉపయోగపడింది. కార్చిచ్చు బాధితుల సహాయం కోసం డబ్బును సమకూర్చడానికి అండగా ఉంటాను. ఈ విపత్తు వల్ల మనుషులతో పాటు మూగజీవులు ఎంతో కోల్పోయాయి" -సచిన్ తెందుల్కర్, దిగ్గజ క్రికెటర్
కార్చిచ్చు బాధితుల సహాయార్థం నిర్వహించే ఛారిటీ మ్యాచ్.. ఆదివారం సిడ్నీ క్రికెట్ మైదానంలో జరగనుంది. గిల్‌క్రిస్ట్ ఎలెవన్ జట్టుతో పాంటింగ్ ఎలెవన్ జట్టు తలపడనుంది. గిల్లీ ఎలెవన్ జట్టులో భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్ ఉన్నాడు.