కెప్టెన్‌గా జట్టుకు మార్గనిర్దేశం చేస్తూనే.. బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్‌గా తనదైన ప్రతిభతో ఆకట్టుకున్న ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ. అభిమానులు, శ్రేయోభిలాషులు ముద్దుగా మాహీ అని పిలుస్తారు. అతడు కెరీర్ ఎంతోమంది యువ ఆటగాళ్లకు స్ఫూర్తి. కెప్టెన్‌గా టీమ్ఇండియాకు ఎన్ని అద్భుత విజయాలు సాధించిపెట్టాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2016 ఆస్ట్రేలియాలో ఆ దేశంతో జరిగిన టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో గెలిపించిన ధోనీ.. 140 ఏళ్ల చరిత్రను తిరగరాశాడు. కంగారూ గడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్ గెల్చిన భారత ఏకైక సారథిగా నిలిచాడు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా వన్డేల్లో(183) అత్యధిక స్కోరు సాధించిన ఘనత కూడా మహీదే.
ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు ధోనీ. తన 16 ఏళ్ల కెరీర్లో మహీ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌లాడి వన్డేలో నంబర్.1 ర్యాంకింగ్ దక్కించుకున్నాడు. అత్యధిక సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించడం సహా కెప్టెన్‌గా ఎక్కువ బౌండరీలు బాదిన వాడిగానూ ప్రత్యేకత చాటుకున్నాడు.
ఇలా కెప్టెన్, బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ అన్నింటా ప్రపంచక్రికెట్లో తొలి స్థానాన్ని దక్కించుకున్నాడు ధోనీ. ఈ క్రమంలోనే కెరీర్లో నెలకొల్పిన తొలి రికార్డులేంటో తెలుసుకుందాం.
వన్డేల్లో 50 కంటే ఎక్కువ సగటు
350 వన్డేలాడిన ధోనీ.. 50 కంటే ఎక్కువ సగటుతో 10వేల పైచిలుకు పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో మహీ ఆరో స్థానంలో ఉన్నాడు. సచిన్, గంగూలీ రెండు మూడు స్థానాల్లో ఉన్నారు. 2004లో అరంగేట్రం చేసినప్పటి నుంచి 50.57 సగటుతో 10,773 పరుగులు చేసి, కోహ్లీ తర్వాత స్థానంలో నిలిచాడు ధోనీ.
టీ20లో ధోనీ సారథ్యంలో విజయాలెన్నో
దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్(2007)లో 25 సంవత్సరాల వయసులోనే కెప్టెన్సీ అందుకున్నాడు ధోనీ. టోర్నీ మొత్తంగా జట్టును అద్భుతంగా నడిపించి విజేతగా నిలిపాడు. చరిత్ర సృష్టించాడు. 1983లో ప్రపంచకప్ సాధించిన తర్వాత.. భారత్ కైవసం చేసుకున్న అతిపెద్ద ట్రోఫీ ఇదే కావడం విశేషం. మొత్తంగా 72 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించి, 41 మ్యాచ్‌లను గెలిపించాడు. టీ20 చరిత్రలో ధోనీ అత్యంత విజయవంతమైన కెప్టెన్ అని చెప్పడానికి ఈ గణాంకాలు చాలు.