క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేస్తే బహుమతిగా ఏమిస్తారు? మహా అయితే ఓ షీల్డ్.. లేకపోతే ఏదైనా మెడల్. కానీ భోపాల్‌లో జరిగిన క్రికెట్ పోటీల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కింద 5 లీటర్ల పెట్రోలు ఇచ్చారు. వినడానికి నవ్వొస్తున్నా.. పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలకు ఈ సంఘటన దర్పం పడుతుంది.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కాంగ్రెస్ నేత మనోజ్ శుక్లా ఓ క్రికెట్ టోర్నీ నిర్వహించారు. ఇందులోని ఓ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కింద 5 లీటర్ల పెట్రోల్‌ను సలాదుద్దీన్ అబ్బాసీ అనే వ్యక్తికి అందించారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరలవుతోంది.
పెట్రోల్‌ను అందిస్తున్న మనోజ్ శుక్లా దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ రేటు వంద రూపాయలు దాటింది. ఇది చాలదన్నట్లు నాలుగు మెట్రో పట్టణాల్లో గృహావసరాల గ్యాస్ ధరను రూ.25 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వీటిపై ప్రతిపక్షాలు, ప్రజలు సామాజిక మాధ్యమాల్లో మీమ్‌లు, జోకులు పేల్చుతున్నారు. సమస్య తీవ్రతను అర్థం అయ్యేలా చెప్పడానికి కొందరు సీరియస్‌గానూ స్పందిస్తున్నారు.
ఇటీవల వైరలైన సంఘటనలు..
- జనవరి 16న తమిళనాడులోని కరూర్ జిల్లాలో ఓ పోటీ జరిగింది. చిన్నారులు ఎవరైనా 'తిరుక్కురల్' పేరును తప్పులు లేకుండా చదివితే ఒక లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇస్తామనేది పోటీ. తిరువల్లువర్ డే సందర్భంగా ఈ పోటీ నిర్వహించారు.
- పెట్రోల్ పంప్ ముందు హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి బ్యాట్ పైకెత్తి సెంచరీ అభివాదం చేస్తున్న ఫొటో ఈ మధ్య తెగ వైరలైంది. పెట్రోల్ ధర వంద రూపాయలు దాటిన నేపథ్యంలో ఈ ఫొటో బయటకొచ్చింది.
ఇదీ చదవండి:'ఇంగ్లాండ్ మాజీలు.. బ్రాడ్ 8/15పైనా మాట్లాడండి'