ఇంగ్లాండ్ క్రికెటర్ డేవిడ్ మలన్ అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో.. తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మలన్ మొత్తం 129 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్‌లో 66 పరుగులతో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు. ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన ఇంగ్లాండ్ జట్టు 2-1 తేడాతో ట్రోఫీ గెల్చుకుంది.
ఇప్పటివరకు టాప్-1లో ఉన్న పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజామ్.. రెండో స్థానానికి పడిపోయాడు.
గతేడాది నవంబరులో రెండవ స్థానంలో ఉన్న మలన్.. ప్రస్తుతం అజామ్ కంటే ఎనిమిది పాయింట్లతో ముందున్నాడు. మలన్ ఇప్పటి 16 టీ20ల్లో ఆడగా.. ఒక సెంచరీ, ఏడు అర్ధ సెంచరీలతో సహా 682 పరుగులు చేశాడు.
తొమ్మిదో స్థానంలో విరాట్
మరోవైపు కొవిడ్ కారణంగా ఆరు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌ను దూరంగా ఉన్న టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్.. నాలుగో స్థానానికి పడిపోయాడు. పరుగుల రారాజు విరాట్ కోహ్లీ... తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ మూడో స్థానంలో ఉన్నాడు.