భారత స్టార్ క్రికెటర్ ధోనీకి సంబంధించిన విశేషాలు వెతుకుతున్నారా..? అయితే జాగ్రత్త అంటోంది సైబర్ సెక్యూరిటీ సంస్థ మెక్ఎఫీ. ప్రపంచ స్థాయి ఆటగాళ్లలో మహేంద్ర సింగ్ ధోనీ గురించి అంతర్జాల శోధన అత్యంత ప్రమాదకరమని వెల్లడించింది.
భారత్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆటగాళ్లలో క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఒకడు. అతడి వ్యక్తిగత విషయాల నుంచి క్రీడా సంబంధిత అంశాలను తెలుసుకునేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంటారు. ఇప్పటికీ అతడి రిటైర్మెంట్ విషయం నెట్టింట చర్చనీయాంశంగానే ఉంది. అందుకే కొన్ని నకిలీ వెబ్సైట్లు, సైబర్ నేరాలకు పాల్పడే వ్యక్తులు ధోనీ ఇమేజ్ను ఉపయోగించుకుంటున్నారు. నెటిజన్లను వలలో పడేయడానికి మహీకి సంబంధించిన సమాచారాన్ని ఓ సాధనంగా వాడుకుంటున్నట్లు సైబర్ సెక్యూరిటీ సేవలు అందించే మెక్ఎఫీ సంస్థ తెలిపింది.
అంతర్జాల శోధకులు ఉచితంగా, పైరేటెడ్ విధానంలో వచ్చిన సమాచారంపైనే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని ఈ సంస్థ నివేదికలో వెల్లడైంది. ముఖ్యంగా క్రీడలు, సినిమాలు, టీవీ కార్యక్రమాలు, ఫొటోల కోసం బాగా వెతుకుతున్నట్లు వివరించింది మెక్ఎఫీ. అయితే వీటినే ఎరగా వేసి కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని వెల్లడించిందీ సంస్థ.