భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ సహా మరో ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదైంది. మహారాష్ట్ర ఔరంగాబాద్‌లోని ఓ ట్రావెల్ సంస్థ యజమాని చేసిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 420, 406, 34ల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.
విమాన టికెట్ల డబ్బులు చెల్లించలేదని..
రూ.20.96 లక్షల విలువైన అంతర్జాతీయ విమాన టిక్కెట్లను బుక్ చేసుకుని డబ్బులు చెల్లించకుండా అజార్ మోసం చేశారని ఔరంగాబాద్‌కు చెందిన డానిష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏజెన్సీ యజమాని షాహాబ్ ఆరోపించారు. గత ఏడాది నవంబర్‌లో అజారుద్దీన్.. అతని స్నేహితులకు తన వ్యక్తిగత సహాయకుడు ముజిబ్ ఖాన్‌తో టికెట్లు బుక్ చేయించుకున్నట్లు తెలిపారు. పలుమార్లు ఆన్‌లైన్లో డబ్బులు చెల్లిస్తానని అతను చెప్పినప్పటికీ.. ఇప్పటి వరకు చెల్లించలేదని ఆరోపించారు.
పలుమార్లు అడిగిన క్రమంలో.. అజార్ స్నేహితుడు సుదేశ్ అవాక్కల్ తనకు రూ.10.6 లక్షలు ఆన్లైన్ ద్వారా పంపించినట్లు ఈమెయిల్ పంపాడని.. కానీ తనకు అందలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు.