2010లో జరిగిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ల వివాహం ఇరుదేశాల మధ్య పెద్ద చర్చకు దారి తీసింది. అయితే, భారత్-పాక్ దేశాల మధ్య ఉన్న భేదాభిప్రాయాలు వీరి బంధానికి ఎప్పుడూ అడ్డురాలేదు. తాజాగా, సానియాతో తన వివాహం గురించి స్పందించాడు షోయబ్. హైదరాబాద్‌కు చెందిన ఓ అమ్మాయిని వివాహం చేసుకునే ముందు తాను ఏమాత్రం భయపడలేదని తెలిపాడు.
"వివాహ సమయంలో మీ భాగస్వామి ఎక్కడ నుంచి వచ్చారు? లేదా ఇరు దేశాల్లో ఏం జరుగుతుందనే అనవసర విషయాల గురించి ఆందోళన చెందరు. మీరు ఒకరిని ప్రేమించి.. ఆ వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకుంటే ఇవన్నీ పట్టించుకోకూడదు. ఇంకా వివరంగా చెప్పాలంటే.. నాకు భారత్‌లో చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధం విషయంలో నేను ఎప్పుడూ బాధపడను. ఎందుకంటే నేను రాజకీయ నాయకుడ్ని కాదు.. ఒక క్రికెటర్ని."
-షోయబ్ మాలిక్, పాక్ క్రికెటర్