తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ20 బ్లాస్ట్​: 7 వికెట్లతో అదరగొట్టిన ఆక్​మన్ - Birmingham Bears

పొట్టి క్రికెట్​లో కొత్త రికార్డు సృష్టించాడు దక్షిణాఫ్రికా బౌలర్​ కొలిన్​ ఆక్​మన్​​. ఇంగ్లాండ్​లో జరుగుతోన్న విటలిటీ బ్లాస్ట్ టీ20 లీగ్​లో లీసెస్టర్​షైర్​ కెప్టెన్​గా ఉన్న ఇతడు.. ఒకే మ్యాచ్​లో 18 పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు.

టీ20 బ్లాస్ట్​: ఏడు వికెట్లతో అదరగొట్టిన ఆక్​మన్

By

Published : Aug 8, 2019, 7:19 PM IST

టీ20 క్రికెట్​ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ కొలిన్‌ ఆక్​మన్. ఒకే మ్యాచ్​లో 18 పరుగులకు 7 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. విటలిటీ బ్లాస్ట్​ టీ20 లీగ్‌లో భాగంగా లీసెస్టర్‌షైర్‌ సారథి కొలిన్‌ ఆక్​మన్​ బౌలింగ్​తో ప్రత్యర్థులను వణికించాడు. ఫలితంగా ఆ జట్టు 55 పరుగుల తేడాతో బర్మింగ్​హామ్​ బియర్స్​పై గెలుపొందింది.

బుధవారం బర్మింగ్​హామ్​ బియర్స్​తో జరిగిన మ్యాచ్​లో కొలిన్‌ తన స్పిన్‌ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. నాలుగు ఓవర్లలో ప్రత్యర్థి జట్టులోని ఏడుగురు ఆటగాళ్లను ఔట్​ చేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇది ప్రపంచ టీ20లో ఓ చరిత్ర. ఇప్పటి వరకు మలేషియా ఆటగాడు అరుల్​ సిపియా తీసిన 6 వికెట్లే పురుషుల టీ20లో రికార్డు.

తొలుత బ్యాటింగ్​ చేసిన లీసెస్టర్‌షైర్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. హ్యారీ స్విండెల్స్‌(63), లూయిస్‌ హిల్‌(58)లు అర్ధశతకాలు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. 190 పరుగుల లక్ష్య ఛేదనలో బర్మింగ్​హామ్​ బియర్స్​ 23 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. తర్వాత సామ్‌ హైన్‌(61), ఆడమ్‌ హోస్‌(34)లు కలిసి మూడో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం అందించారు. బియర్స్​ జట్టు బాగా కుదురుకుంటోన్న సమయంలో బంతి అందుకున్న కొలిన్​.. ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. అతడి స్పిన్​ మాయాజాలం ధాటికి 20 పరుగుల తేడాతో 8 వికెట్లు కోల్పోయింది బర్మింగ్​హామ్. ఫలితంగా 17.4 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది.

ABOUT THE AUTHOR

...view details