తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఓ ఐసీసీ... 143 ఏళ్ల టెస్టు క్రికెట్​ను వదిలేయ్​ ప్లీజ్​'

ఐసీసీ ప్రతిపాదించిన నాలుగు రోజుల టెస్టులపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా మాజీ క్రికెటర్లు ఇయాన్‌ బోథమ్‌, మహేళ జయవర్ధనే, సందీప్‌ పాటిల్‌ తమ గళం వినిపించారు. సచిన్‌ తెందూల్కర్‌, కోహ్లీ అభిప్రాయంతో వీరందరూ ఏకీభవించారు.

Legendary All-Rounder Sir Ian Botham Has Urged the ICC to Leave Test Cricket Alone
'ఓ ఐసీసీ... 143 ఏళ్ల టెస్టు క్రికెట్​ను వదిలేయ్​ ప్లీజ్​'

By

Published : Jan 8, 2020, 9:21 PM IST

క్రికెట్​లో 143 ఏళ్లుగా ఉన్న టెస్టు ఫార్మాట్​ను మార్చొద్దని సూచించాడు ఇంగ్లాండ్​ దిగ్గజ ఆల్​రౌండర్​ ఇయాన్​ బోథమ్​. నాలుగు రోజుల టెస్టు అంశంపై తాజాగా స్పందించాడు. టెస్టు క్రికెట్‌లో ఎలాంటి మార్పులు అవసరం లేదని ఐసీసీకి సూచించాడు ఇయాన్​. దక్షిణాఫ్రికా-ఇంగ్లాండ్​ మధ్య రెండో టెస్టు ఐదో రోజు వరకు ఉత్కంఠగా సాగిందని.. ఇదే టెస్టు మ్యాచ్​ల గొప్పదనమని చెప్పాడు. ఈ మ్యాచ్​లో 189 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లీష్​ జట్టును అభినందించాడు​.

" ఇంగ్లాండ్‌ బాగా ఆడింది. ఐదు రోజుల క్రికెట్‌ను చక్కగా ముగించడమన్నది మంచి ఆలోచన. స్టేడియం అంతా నిండింది. అత్యుత్తమ క్రికెట్‌ ఫార్మాట్‌ను ఒంటరిగా వదిలేయండి. అసలైన క్రికెటర్లను వెలికితీసేందుకు, ఆటగాళ్లలో నైపుణ్యం, ధైర్యం, సహనం, సామర్థ్యాన్ని పరీక్షించేందుకు నిజమైన క్రికెట్‌ ఇదే. దాని మానాన దాన్ని వదిలేయండి".
-- ఇయాన్​ బోథమ్​, ఇంగ్లాండ్​ క్రికెటర్​

ఉత్కంఠకర మ్యాచ్​...

కేప్‌టౌన్‌ వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన రెండో టెస్టులో డ్రా కోసం గట్టిగా పోరాడింది దక్షిణాఫ్రికా. అయినా పరాజయం నుంచి తప్పించుకోలేకపోయింది. ఆలౌరౌండర్​ బెన్‌ స్టోక్స్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసినందున ఇంగ్లాండ్‌ 189 పరుగుల తేడాతో గెలిచింది. చివరిదైన ఐదో రోజు మంగళవారం కేవలం 8.2 ఓవర్ల ఆట మిగిలి ఉండగా దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 248 పరుగులకు ఆలౌటైంది. మొండిగా పోరాడిన ఆ జట్టును స్టోక్స్‌ (3/35) దెబ్బతీశాడు. 14 పరుగుల వ్యవధిలో ఆఖరి మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ను విజయపథంలో నడిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 269 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా 223 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 391/8 వద్ద డిక్లేర్‌ చేసింది. ఇంగ్లాండ్‌ విజయంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమం అయింది.

ఐసీసీ ప్రతిపాదనను సందీప్​ పాటిల్‌ తప్పుబట్టాడు. అదొక తెలివి తక్కువ నిర్ణయంగా అభివర్ణించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌కున్న లక్షణాలు, స్వభావాలను చంపేయొద్దని సూచించాడు​. ఇతడితో పాటు నాలుగు రోజుల టెస్టులను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నానని శ్రీలంక మాజీ క్రికెటర్‌, ఐసీసీ కమిటీ సభ్యుడు మహేళా జయవర్ధనే అన్నాడు. సచిన్​ తెందూల్కర్​, మెక్​గ్రాత్​, గౌతమ్​ గంభీర్​ సహా విరాట్​ కోహ్లీ, నాథన్​ లయన్​ వంటి ఆటగాళ్లు.. నాలుగు రోజుల టెస్టు నిర్ణయంపై విమర్శలు గుప్పించారు.

ABOUT THE AUTHOR

...view details