తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమిండియా సెలక్టర్‌ రేసు నుంచి లక్ష్మణ్ ఔట్! - Laxman sivaramakrishnan out from selectors race

టీమిండియా చీఫ్ సెలక్టర్ రేసులో ఊహించని పరిణామం​ చోటు చేసుకుంది. మాజీ క్రికెటర్లు అగార్కర్, వెంకటేశ్​కు గట్టి పోటీనిస్తున్న లక్ష్మణ్​ శివరామకృష్ణన్.. అనూహ్యంగా రేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులో ఛైర్మన్​ ఎవరన్న విషయమై స్పష్టత రానుంది.

లక్ష్మణ్
లక్ష్మణ్

By

Published : Feb 16, 2020, 4:09 PM IST

Updated : Mar 1, 2020, 12:57 PM IST

భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ రేసు నుంచి మాజీ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని టీమిండియా సెలక్షన్ కమిటీ గడువు ఇటీవల ముగిసింది. ఫలితంగా కొత్త సెలక్టర్ల కోసం బీసీసీఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పదవిని ఆశిస్తూ అజిత్ అగర్కార్, వెంకటేశ్ ప్రసాద్, రాజేష్ చౌహాన్, నయాన్ మోంగియా, చేతన్ చౌహాన్, నిఖిల్ చోప్రా, లక్ష్మణ్ శివరామకృష్ణన్ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అజిత్ అగర్కార్, వెంకటేశ్, లక్ష్మణ్ శివరామకృష్ణన్ చీఫ్ సెలక్టర్ పదవికి గట్టి పోటీదారులుగా కనిపించారు. కానీ.. తాజాగా లక్ష్మణ్ ఈ రేసు నుంచి తప్పుకున్నట్లు సమాచారం.

చీఫ్ సెలక్టర్, ఒక సెలక్టర్ పదవికి వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ).. విరుద్ధ ప్రయోజనాల అంశం కింద లక్ష్మణ్ దరఖాస్తుని తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ యజమాని, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌కు చెందిన ఇండియా సిమెంట్స్‌లో ఉద్యోగిగా లక్ష్మణ్ ఉన్నట్లు బీసీసీఐ విచారణలో తేలింది. ఫలితంగా అతని పేరును షార్ట్ లిస్ట్‌లో నుంచి తొలగించినట్లు సమాచారం. గతేడాది విరుద్ధ ప్రయోజనాల అంశం కింద రాహుల్ ద్రవిడ్, సౌరభ్ గంగూలీ, సచిన్ తెందూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ తదితరులకు బీసీసీఐ అంబుడ్స్‌మన్ నోటీసులు జారీ చేసింది.

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఇటీవల మాట్లాడుతూ.. టెస్టుల్లో అత్యంత అనుభవం ఉన్న ఆటగాళ్లకు చీఫ్ సెలక్టర్ పదవి దక్కబోతోందని హింట్ ఇచ్చాడు. తాజాగా లక్ష్మణ్ శివరామకృష్ణన్ రేసు నుంచి తప్పుకోవడం వల్ల.. అజిత్ అగార్కర్, వెంకటేశ్ ప్రసాద్ మాత్రమే పోటీలో నిలిచినట్లు తెలుస్తోంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు త్వరలోనే క్రికెట్ సలహా కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.

Last Updated : Mar 1, 2020, 12:57 PM IST

ABOUT THE AUTHOR

...view details