యువ ఓపెనర్ పృథ్వీషా టీమ్‌ఇండియాలో చోటు కోసం మరికొన్నాళ్లు ఆగాల్సి ఉంటుందని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. ఇప్పటికే జట్టులో నలుగురు ఓపెనర్లు ఉన్నారని పేర్కొన్నాడు. శుభ్‌మన్ గిల్ ఉండటం వల్ల.. షా వరుసలో వేచిచూడాల్సి వస్తోందని తెలిపాడు. విజయ్ హజారేలో ముంబయిని విజేతగా నిలిపిన అతడిపై ప్రశంసలు కురిపించాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో జట్టులో అవకాశవచ్చినప్పటికీ.. షా విఫలమయ్యాడు. అతడి స్థానంలో తుది జట్టులో చోటు సంపాదించుకున్న శుభ్‌మన్ గిల్ అదరగొట్టాడు. జట్టుకు శుభారంభాలు అందించాడు. బ్యాటింగ్‌లో తన పొరపాట్లు సవరించుకున్న షా దేశవాళీ క్రికెట్లో రాణించాడు. విజయ్ హజారేలో 8 మ్యాచుల్లో 165.40 సగటుతో 827 పరుగులు సాధించాడు. నాలుగు శతకాలు బాదేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు.
"విజయ్ హజారేలో పృథ్వీషా అదరగొట్టాడు. సారథిగా ముంబయికి ట్రోఫీ అందించాడు. టీమ్‌ఇండియా వన్డే జట్టులో చోటుకు అతడు అర్హుడే. అయితే గొప్ప ప్రదర్శనలు చేసిన ఆటగాళ్లందరినీ సెలక్టర్లు వరుసలో ఉంచుతున్నారు. షా ఇప్పుడా వరుసలో గిల్ తర్వాత స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో గిల్ రాణించాడు. అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఇప్పటికే అనుభవజ్ఞులైన ఓపెనర్లు రాహుల్, ధావన్, రోహిత్ జట్టులో ఉన్నారు. జట్టులో ముగ్గురు, నలుగురు ఓపెనర్లకే అవకాశం ఉంటుంది" అని లక్ష్మణ్ అన్నాడు.
'పృథ్వీ షాకు కచ్చితంగా అవకాశం వస్తుంది. అతడు తన బ్యాటింగ్ టెక్నిక్‌ను సరిచేసుకొని ఆకట్టుకున్నాడు. కేవలం ప్రదర్శనలే కాదు బ్యాటింగ్ సమస్యలనూ అతడు విజయ్ హజారేలో అధిగమించాడు. నిలకడగా రాణించాడు. అతడో మ్యాచ్ విజేత. అతడికి అవకాశం వస్తుందనడంలో సందేహం లేదు’ అని వీవీఎస్ పేర్కొన్నాడు.
ఇదీ చదవండి:పొలార్డ్‌కు పితృవియోగం.. సచిన్ సంతాపం