లంక ప్రీమియర్ లీగ్ నిర్వహించడానికి ఆరోగ్య మంత్రిత్వశాఖ నుంచి తగిన అనుమతి లభించలేదని ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. నవంబరు 4 నుంచి ఆటగాళ్లకు 14 రోజుల నిర్బంధానికి ఏర్పాట్లు చేయాల్సిన క్రమంలో టోర్నీ నిర్వహణపై ఇప్పటికి స్పష్టత రాకపోవడంపై బోర్డు అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
"లంక ప్రీమియర్ లీగ్ నిర్వహణ గురించి ఆందోళన చెందుతున్నాం. ఎందుకంటే ఆరోగ్య శాఖ అధికారులు మాకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. తగిన అనుమతులు రాకుంటే టోర్నీని మరోసారి వాయిదా వేయాల్సి ఉంటుంది. దీని వల్ల అదనపు ఖర్చుతో పాటు ఆటగాళ్ల లభ్యత ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. అనుమతి కోసం ఇప్పటికే ఆరోగ్య శాఖ అధికారులతో అనేక సార్లు చర్చలు జరిపాం. మ్యాచ్లు హంబంటోటా, పల్లెకెలెలో మాత్రమే జరుగుతాయి. అక్కడ ఏర్పాటు చేసే బయో-బబుల్లో ఆటగాళ్లను చేరుస్తాం. ఐపీఎల్లో పాల్గొన్న చాలా మంది ఆటగాళ్లు అక్కడి నుంచి సరాసరి ఇక్కడికి వస్తున్నారు. టోర్నీ నిర్వహణపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి క్లియరెన్స్ కోరాం. ఆ అధికారుల అనుమతి కోసం వేచి చూస్తున్నాం."