భారత్, పాకిస్థాన్ క్రికెట్ సిరీస్ అంటేనే ఒక యుద్ధం. ఆటగాళ్లు అంత కసిగా తలపడుతారు. వీరిద్దరి మధ్య మ్యాచ్ జరుగుతుంటే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. అయితే 2003-04లో పాకిస్థాన్‌లో పర్యటించిన టీమిండియా జట్టు ఎన్నో మధురానుభూతులను మిగిల్చింది.
ఈ సిరీస్‌లో వీరేంద్ర సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ, రాహుల్ ద్రవిడ్ డబుల్ సెంచరీ, ఇర్ఫాన్ పఠాన్ మెరుగైన ప్రదర్శన ఇలా పాక్ టూర్‌లో టీమిండియా అదిరిపోయే ఆటతీరుతో ఆకట్టుకుంది. అయితే ఈ సిరీస్‌లో మరో ఆటగాడు మాజీ పేసర్ లక్ష్మీపతి బాలాజీ ఆటతీరును గుర్తుచేసుకున్నాడు మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా. తన జీవితంలో బాలాజీ మర్చిపోలేని ఆటగాడని మనసులోని మాట తెలిపాడు. ఆ సిరీస్‌లో లక్ష్మీపతి ప్రదర్శించిన అద్భుతమైన ఆట టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిందని అన్నాడు. ఆ సమయంలో బాలాజీ.. పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్(ప్రస్తుత పాక్ ప్రధాని) కంటే కూడా ప్రసిద్ధిచెందిన ఆటగాడని అని అన్నాడు.
"ఆ పర్యటనలో నాకు బాగా గుర్తుండిపోయిన ఒకేఒక్కటి లక్ష్మీపతి బాలాజీ ఆటతీరు. షోయబ్ అక్తర్(పాక్ మాజీ బౌలర్), మహ్మద్ సమీ(పాక్ మాజీ క్రికెటర్) వంటి ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌లో ధనాధన్ సిక్స్‌లు బాదాడు. ఆ సమయంలో అతడు ఇమ్రాన్ ఖాన్ కంటే ప్రసిద్ధి చెందిన ఆటగాడు." -ఆశిష్ నెహ్రా, టీమిండియా మాజీ క్రికెటర్