165 పరుగుల లక్ష్యఛేదనలో 14.1 ఓవర్లలో 115/0తో ఉన్నారు. 35 బంతుల్లో 50 సాధించాలి. చేతిలో పది వికెట్లు. ఇలాంటి స్థితిలో ఎంతటి సాదాసీదా జట్టైనా సరే.... గెలుపుపై ధీమాతో ఉంటుంది. ఆ జట్టు, దాని అభిమానులందరూ కూడా 2 పాయింట్లు వచ్చేసినట్టే అనుకున్నారు. ఆ క్షణాన వారి అంచనాలను అందరి ముఖకవళికలు ప్రతిబింబించాయి.
ఈ డగౌట్లో నవ్వులు... ఆ డగౌట్లో డల్ ఫేస్‌లు... ఇక్కడ ధీమా... అక్కడ నిర్వేదం.. మరి మ్యాచ్‌కు ఆఖరికి అంతా వారనుకున్నట్టే అయిందా..? అస్సలు కాలేదు. బొమ్మ 360 డిగ్రీలూ తిరిగిపోయింది. అక్కడి ఎక్స్ప్రెషన్స్ ఇక్కడికి... ఇక్కడివి అక్కడికి క్షణాల్లో బదిలీ అయిపోయాయి.
శనివారం సాయంత్రం జరిగిన పంజాబ్-కోల్‌కతా మ్యాచ్ ఫలితం తేలాక... 'అయ్యో..! ఈ సీజన్లో పంజాబ్‌ను దురదృష్టం ఇలా పట్టుకుందేంటి? గెలవాల్సిన మ్యాచ్‌లూ ఓడిపోతున్నారు?!' అని అనుకోని క్రికెట్ అభిమాని ఉండడేమో. ఈ భావనలో తప్పు లేదు. కానీ, నిజంగా పంజాబ్ ఓటమిని దురదృష్టం ఖాతాలో వేసేయగలమా..? నిజమే.. ఆఖరి బంతికి సెంటీమీటర్ల తేడాలో సిక్స్ మిస్ అయింది. కాస్త అవతల పడుంటే మ్యాచ్‌కు సూపర్ ఓవర్‌కు వెళ్లేది. అప్పుడు గెలిచేవారేమో...! ఇవన్నీ పక్కనపెడితే... ఆఖరి బంతి వరకూ వెళ్లాల్సిన మ్యాచేనా ఇది...? కచ్చితంగా కాదు. ఈ ఓటమి పంజాబ్ స్వయంకృతాపరాధం, కోల్‌కతా అదృష్టం తప్ప ఇంకోటి కాదు.
కారణాలేంటి..?
ఏ జట్టైనా తమ ఓపెనర్లు శుభారంభాన్ని ఇవ్వాలని కోరుకుంటుంది. పంజాబ్‌కు రాహుల్, అగర్వాల్ రూపంలోని ఇద్దరు నాణ్యమైన ఆటగాళ్లు దాదాపుగా ప్రతి మ్యాచ్‌లోనూ ఆ బాధ్యతను నెరవేర్చారు. నిన్న కూడా తొలి వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. బ్యాట్స్‌మన్‌కు పిచ్ కాస్త పరీక్ష పెడుతుండటం వల్ల... వికెట్ కాపాడుకుంటూనే సాధించాల్సిన రన్‌రేట్ మరీ పెరగకుండా చూసుకున్నారు. అయితే కనీసం 8 ఓవర్ల తర్వాతైనా స్కోరింగ్ వేగాన్ని పెంచాల్సింది పోయి అతిజాగ్రత్తకు పోయినట్టు కనిపిస్తోంది. ఇందుకు వారిద్దరినీ నిందించలేం. వారు ఔట్ అయితే... ఆ తర్వాత జట్టును కాపాడే ఆటగాడు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. పూరన్ గత మ్యాచ్‌లో మెరిశాడే తప్ప... మ్యాక్స్‌వెల్, కుర్రాళ్లు మన్దీప్, ప్రభ్‌సిమ్రన్ సింగ్‌పై ఎవరికీ అంచనాల్లేవు. ఈ భయంతోనే వికెట్ పడకూడదన్న సంకల్పంతో ఆడిన వారిద్దరూ... ఇన్నింగ్స్‌కు కావాల్సిన ఆ ఎక్స్ట్రా జోష్‌ను తీసుకురాలేకపోయారు. చివరివరకూ ఉండి మ్యాచ్‌ను గెలిపించి కీలకమైన ఆ రెండు పాయింట్లు సాధిద్దామనుకున్నారు. కానీ, అగర్వాల్ ఔట్ అయ్యాక వారి పతనం మొదలైంది. వన్‌డౌన్‌లో వచ్చిన పూరన్ ఓ మూడు షాట్లు కొట్టి ఔటయ్యాడు. అప్పటికి 16 బంతుల్లో 21 మాత్రమే సాధించాలి.
ఇలాంటి స్థితిలో సారథి రాహుల్, పంజాబ్ మేనేజ్మెంట్ ఓ పొరపాటు చేసిందని చెప్పుకోవాలి. మ్యాక్స్‌వెల్ కన్నా ముందు కుర్రాడు ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను పంపడం ఓ వ్యూహాత్మక తప్పిదంగా మిగిలింది. విధ్వంసక బ్యాటర్ మ్యాక్స్‌వెల్ ఫామ్‌లో లేనప్పటికీ ఇలాంటి ఒత్తిడి పరిస్థితుల్లో యువ ఆటగాడ్ని పంపడంపై నిపుణులూ పెదవివిరిచారు. నాలుగోస్థానంలో వచ్చి మ్యాక్స్‌వెల్ మ్యాచ్‌ను గెలిపించి ఉండుంటే అతని ఆత్మవిశ్వాసమూ పెరిగి తర్వాతి పోరుల్లో జట్టుకు బలంగా మారి ఉండేవాడని అభిప్రాయపడ్డారు.