ఐపీఎల్-2020లో భాగస్వాములయ్యే క్రికెటర్లకు ప్రతి రోజూ కొవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తే మంచిదని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా అన్నాడు. ఒకవేళ తానే క్రికెటరైతే రోజూ పరీక్షలు చేయించుకునేందుకు ఇబ్బందిపడనని పేర్కొన్నాడు. యూఏఈలో ఎనిమిది జట్లతో బయోసెక్యూర్ వాతావరణానికి వీలవుతుందో లేదో చూడాలని వెల్లడించాడు.
"నేనే క్రికెటరైతే రోజూ పరీక్షలు చేయించుకోవడం నాకిష్టం. ఇందులో ఇబ్బందేమీ లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో టెస్టు చేయించుకుంటే మంచిది. ఐపీఎల్‌ను సురక్షితంగా, విజయవంతంగా నిర్వహించాలంటే మైదానంలో, మైదానం ఆవల కఠిన నిబంధనలు అమలు చేయాలి. ఇందులో రాజీ పడొద్దు. బయో సెక్యూర్ వాతావరణం ఏర్పాటుకు ప్రయత్నించాలి. ఎనిమిది జట్లతో అది కుదురుతుందో లేదో తెలియదు. మేమైతే బీసీసీఐ నుంచి నిర్వహణ ప్రక్రియ నిబంధనల కోసం ఎదురుచూస్తున్నాం. యూఏఈలో టెస్టింగ్ రేటు ఎక్కువగా ఉంది. అందుకు అవసరమైన సాంకేతికత, సామర్థ్యం వారికుంది. ఆటగాళ్లకు పరీక్షలు నిర్వహించేందుకు బీసీసీఐ స్థానిక ప్రభుత్వ సాయం తీసుకోవాలి. భారత్‌లో విమానం ఎక్కే ముందు, దుబాయ్‌లో దిగాక వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. లేదంటే యూఏఈ నిబంధనల ప్రకారం క్వారంటైన్‌లో ఉండాల్సిందే."