ఐసీసీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టే విషయమై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీకి మద్దతుగా నిలిచాడు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార్ సంగక్కర. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ముందే.. దాదా పరిపాలన, కోచింగ్ విధానాన్ని తాను గమనించినట్లు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెటర్లతో ఏ విధంగా సత్సంబంధాలు పెంచుకోవాలో అతడికి బాగా తెలుసని అన్నాడు. ఐసీసీ ఛైర్మన్ పదవికి సౌరభ్ సరైన వ్యక్తని చెప్పడంలో సందేహమే లేదని స్పష్టం చేశాడు.
"సౌరభ్ కచ్చితంగా క్రికెట్లో మార్పు తీసుకురాగలడని నా నమ్మకం. క్రికెటర్గా అతడి బ్యాటింగ్ ప్రదర్శనకు మాత్రమే నేను అభిమాని కాదు. క్రికెట్ పరంగా చురుకైన ఆలోచనలు ఉన్న వ్యక్తి గంగూలీ. దాదాకు ఆటపై అపారమైన ప్రేమ ఉంది. బీసీసీఐ అధ్యక్షుడిగానో, మరే ఇతర బోర్డు మెంబరుగానో ఉన్నంత మాత్రాన అది మారదు"