ఆసీస్ సీనియర్ స్పిన్నర్ నాథన్ లైయన్, టీమ్‌ఇండియా ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ వద్ద మెలకువలు నేర్చుకున్నానని చైనామన్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ వెల్లడించాడు. వారిద్దరూ గొప్ప సలహాలు సూచించారని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2020లో తన బౌలింగ్ లయ బాగుందని వెల్లడించాడు. తనకు మరిన్ని మ్యాచుల్లో అవకాశం వస్తే బాగుండేదని వివరించాడు.
"నేథన్ లైయన్‌తో చాలా మాట్లాడాను. అతడేం చేస్తాడో, ఎలా సన్నద్ధమవుతాడో అడిగాను. తేలికపాటి కసరత్తులే చేస్తానని బదులిచ్చాడు. తన నైపుణ్యాలు, టర్న్ చేసేందుకు బంతిపై చేతివేళ్లను ఎలా కదుపుతాడో తెలిపాడు. అదే అతడి బలమన్నాడు. సొంత కసరత్తులే అనుసరించమని సూచించాడు. బంతిని పిచ్ చేసే ప్రదేశాలను గుర్తించాలని వివరించాడు. చిరునవ్వుతో నా బౌలింగ్‌ను ఆస్వాదించాలని సలహా ఇచ్చాడు" అని కుల్‌దీప్ అన్నాడు.