'నమ్మకం కోల్పోవద్దు.. భవిష్యత్తులో కప్పు మీదే' - సచిన్ కోహ్లీ వార్తలు
మహిళా టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఓడిన టీమిండియాకు సోషల్ మీడియా వేదికగా అండగా నిలిచారు పలువురు క్రికెటర్లు. అధైర్యపడొద్దని, భవిష్యత్తులో కప్పు కొడతారని భరోసానిచ్చారు.
భారత మహిళా క్రికెట్ జట్టు
మహిళల క్రికెట్‌లో దేశానికి తొలి ప్రపంచకప్ అందించాలనుకున్న హర్మన్‌సేనకు నిరాశే మిగిలింది. లీగ్ దశలో ఓటమెరుగని జట్టుగా టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వెళ్లిన భారత్.. తుది పోరులో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా చేతిలో 85 పరుగుల తేడాతో ఘోరంగా ఓడింది. ఫైనల్ మినహా, మెగాటోర్నీలో గొప్ప ప్రదర్శన కనబరిచిన భారత మహిళా జట్టుకు సామాజిక మాధ్యమాల్లో అభినందనలు వెల్లువెత్తాయి. రన్నరప్‌గా నిలిచిన మహిళా జట్టుకు మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు, అభిమానులు అండగా నిలిచారు.
- "ప్రపంచకప్‌లో భారత మహిళా జట్టు అద్భుతంగా పోరాడినందుకు ఎంతో గర్వంగా ఉంది. హర్మన్‌సేన తిరిగి పుంజుకుని బలంగా సత్తా చాటుతుందనే నమ్మకం ఉంది" - విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్
- "ఆస్ట్రేలియా జట్టుకు అభినందనలు. భారత్‌కు ఫైనల్ కఠినంగా సాగింది. యువ క్రికెటర్లతో నిండిన మన జట్టు భవిష్యత్‌లో బలంగా తయారవుతుంది. ప్రపంచవ్యాప్తంగా చాలామందిలో మీరు స్ఫూర్తి రగిల్చారు. మీ పట్ల గర్వపడుతున్నాం. కష్టపడుతూనే ఉండండి. నమ్మకాన్ని కోల్పోవద్దు. కచ్చితంగా ఓ రోజు మీరు విజయాన్ని సాధిస్తారు" -సచిన్ తెందుల్కర్, దిగ్గజ క్రికెటర్
- "కెప్లెన్ హర్మన్‌ప్రీత్, జట్టు సభ్యులకు అభినందనలు. ప్రపంచకప్‌లో మీ ప్రదర్శన గొప్పగా ఉంది. మహిళల క్రికెట్‌ను అందరూ ప్రోత్సహించండి. తర్వలో మరిన్ని విజయాలు సాధిస్తాం" -మిథాలీ రాజ్, భారత వన్డే సారథి
-
"మన మహిళా జట్టు శాయశక్తులా ప్రయత్నించింది. ఇదీ కేవలం ఒక్క దుర్దినం మాత్రమే. వారి ఆటను ఎంతో ఆస్వాదించా. భవిష్యత్తులో రాణించాలని కోరుకుంటున్నా. టీ20 ప్రపంచకప్ గెలిచిన ఆసీస్‌కు శుభాకాంక్షలు"
- వీరేంద్ర సెహ్వాగ్, భారత మాజీ క్రికెటర్
- "భారత్ అద్భుతంగా పోరాడింది. జట్టు గొప్పగా పోరాడటంలో కీలక పాత్ర పోషించిన భారత మహిళా జట్టు కోచ్ రామన్‌కు అభినందనలు. ఫైనల్లో ఆధిపత్యం చెలాయించి ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాకు శుభాకాంక్షలు" -రవిచంద్రన్ అశ్విన్, టీమ్‌ఇండియా స్పిన్నర్
- "ఎప్పటికీ అధైర్య పడకండి. మెగాటోర్నీలో అద్భుత ప్రదర్శనన కనబరిచారు. ఏదో ఒక రోజు తప్పక మీరు ప్రపంచకప్‌ను ముద్దాడతారు. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు" - వివ్ రిచర్డ్స్, వెస్టిండీస్ మాజీ క్రికెటర్
- "టీ20 ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా మహిళా జట్టుకు శుభాకాంక్షలు. ఇక ప్రపంచకప్‌లో భారత మహిళా జట్టు పోరాడిన తీరుకి ఎంతో గర్వంగా ఉంది. మెగా టోర్నీలో మీ పోరాటాన్ని ఎంతో ఆస్వాదించా. భవిష్యత్తులో ఇంకా గొప్పగా ఆడాలని కోరుకుంటున్నా" - వీవీఎస్ లక్ష్మణ్, భారత మాజీ క్రికెటర్
- "ప్రపంచకప్‌ను త్రుటిలో చేజార్చుకుంటే ఆ బాధ ఎంతో కఠినంగా ఉంటుంది. అధైర్య పడకండి. ఫలితం గురించి ఆలోచించకండి. మీరు ఎంతో మందికి ప్రేరణగా నిలిచారు. ప్రపంచకప్‌లో మీ ప్రదర్శన పట్ల ఎంతో గర్వపడుతున్నాం. ఆసీస్‌కు శుభాకాంక్షలు" - మహ్మద్ కైఫ్, భారత మాజీ క్రికెటర్