తెలంగాణ

telangana

ETV Bharat / sports

లారెస్​​: సచిన్​ను భుజాలపై మోసిన ఆటగాళ్ల మాటలివే - sachin latest news

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌.. ప్రతిష్ఠాత్మక లారెస్‌ స్పోర్టింగ్‌ మూమెంట్‌ అవార్డును గెలుచుకున్నాడు. 2011 ప్రపంచకప్‌ గెలిచిన అనంతరం సచిన్‌ను సహచరులు భుజాలకెక్కించుకుని మైదానం అంతా తిప్పడాన్ని అభిమానులెవరూ మరిచిపోలేరు. ఆ సందర్భమే గత 20 ఏళ్లలో అత్యుత్తమ లారెస్‌ స్పోర్టింగ్‌ మూమెంట్‌గా ఎంపికైంది. ఈ పురస్కారం రావడంపై తాజాగా మాస్టర్​కు పలువురు క్రికెటర్ల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

Laureus Honour
సచిన్‌ తెందుల్కర్​

By

Published : Feb 19, 2020, 11:07 AM IST

Updated : Mar 1, 2020, 7:50 PM IST

కోట్లాది మంది అభిమానుల ఓట్ల మద్దతుతో ప్రతిష్ఠాత్మక లారెస్‌ స్పోర్టింగ్‌ మూమెంట్‌ అవార్డును గెలుచుకున్నాడు దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​. 2011 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత మాస్టర్​ను సహచరులు భుజాలకెక్కించుకుని మైదానం అంతా తిప్పడం... ప్రతి భారతీయుడిని కదిలించింది. అందుకే ఆ ఆనంద క్షణం.. గత 20 ఏళ్లలో అత్యుత్తమ లారెస్‌ స్పోర్టింగ్‌ మూమెంట్‌గా ఎంపికైంది. సచిన్​కు పలువురు క్రికెటర్ల నుంచి ప్రశంసలు వెళ్లువెత్తుతున్నాయి.

మాటల్లో చెప్పలేను..

"నా ప్రయాణం 1983లో ఆరంభమైంది. అప్పుడు నా వయసు పదేళ్లు. భారత్‌ ప్రపంచకప్‌ గెలిచింది. దాని ప్రాముఖ్యత అప్పటికి నాకు తెలియదు. అందరూ సంబరాలు చేసుకుంటుంటే నేనూ వాళ్లతో కలిశా. కానీ ఏదో ప్రత్యేకమైంది జరిగిందని నాకు తెలుసు. ఏదో ఒక రోజు అలాంటి అనుభవాన్ని నేనూ పొందాలనుకున్నా. 22 ఏళ్ల నిరీక్షణ తర్వాత ట్రోఫీని అందుకున్న క్షణం నా జీవితంలో అత్యంత గర్వించే క్షణం" అని అని ట్రోఫీ స్వీకరించిన అనంతరం సచిన్‌ చెప్పాడు. అంతేకాకుండా ఆ రోజు మొత్తం దేశమంతా సంబరాలు చేసుకుందని అభిప్రాయపడ్డాడు.

పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా సచిన్‌కు భారత జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అభినందనలు తెలిపాడు. "ప్రతిష్ఠాత్మక లారెస్‌ అవార్డు అందుకున్నందుకు అభినందనలు సచిన్‌ పాజీ. ఇది గొప్ప ఘనత. దేశానికి గర్వకారణం" అని కోహ్లీ ట్వీట్‌ చేశాడు.

20 ఏళ్ల సందర్భంగా...

ఆన్‌లైన్‌ ఓటింగ్‌లో అత్యధిక ఓట్లు పొందిన సచిన్‌.. ఈ పురస్కార విజేతగా నిలిచాడు. సోమవారం రాత్రి బెర్లిన్‌లో ఘనంగా జరిగిన అవార్డుల కార్యక్రమంలో.. టెన్నిస్‌ దిగ్గజం బోరిస్‌ బెకర్‌ విజేతను ప్రకటించాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ వా.. సచిన్‌కు ట్రోఫీని అందించాడు. మరోవైపు ఫుట్‌బాల్‌ స్టార్‌ మెస్సి (అర్జెంటీనా), ఫార్ములావన్‌ రేసర్‌ లూయిస్‌ హామిల్టన్‌ (బ్రిటన్‌)లు 'లారెస్‌ వరల్డ్‌ స్పోర్ట్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇయర్‌' అవార్డును సంయుక్తంగా గెలుచుకున్నారు. వీరిద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి.

లారెస్‌ సంస్థ ఏటా వివిధ క్రీడల్లో అత్యుత్తమ ఆటను ప్రదర్శించిన క్రీడాకారులకు పురస్కారాలు అందజేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా క్రీడా రంగంలో ఈ పురస్కారాలకు ప్రత్యేక గుర్తింపుంది. క్రీడాకారులు ఈ అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈసారి ఇచ్చిన పురస్కారాలు మరింత ప్రత్యేకం. లారెస్‌ క్రీడా అవార్డులు నెలకొల్పి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. 2000-20 మధ్య కాలంలో అత్యంత ప్రభావం చూపిన క్రీడాకారులకు అవార్డులు అందించారు.

Last Updated : Mar 1, 2020, 7:50 PM IST

ABOUT THE AUTHOR

...view details