మానసిక ఆరోగ్య సమస్యలతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరామం తీసుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మద్దతుగా నిలిచాడు. అతడి నిర్ణయం అసాధారణమని ప్రశంసించాడు. 2014 ఇంగ్లాండ్ పర్యటనలో తానూ ఇలాంటి బాధనే అనుభవించానని తెలిపాడు.
"అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నప్పుడు జట్టులోని ప్రతి ఆటగాడికి భావప్రసారం అవసరం. అన్ని విషయాలు పంచుకోగలిగే సామర్థ్యం ఉండాలి. గ్లెన్ (మ్యాక్స్‌వెల్) చేసింది అసాధారణం. నా కెరీర్లో అలాంటి దశను నేనూ ఎదుర్కొన్న. ఇక ప్రపంచం ముగిసిపోయింది అనుకున్నా. ఏం చేయాలో, ఏం మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియదు" అని 2014 ఇంగ్లాండ్ పర్యటన గురించి విరాట్ వివరించాడు.
"నిజంగా చెప్పాలంటే చేయడానికి మీకో (జర్నలిస్టులు) పనుంది. మాకూ ఓ పనుంది. మనందరం దానిపైనే దృష్టి పెట్టాలి. అవతలి వ్యక్తుల ఆలోచన ఎలా ఉందో తెలుసుకోవడం చాలా కష్టం. మ్యాక్స్‌వెల్ తన నిర్ణయంతో ఈ ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలిచాడు. మన మనస్సు సరిగ్గా లేనప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాం. ఒకానొక దశలో విసిగిపోతాం. అలాంటప్పుడు కొంత సమయం తీసుకోవడం అవసరం."
-విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్