కరోనా ఎంతో మందికి గుణపాఠాలు నేర్పిందని అన్నాడు టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ. అలాగే స్లెడ్జింగ్ చేయడంలో అర్థం లేదని తాను గ్రహించినట్లు వెల్లడించాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీసులో అనవసర విషయాల వడపోత జరుగుతుందని అన్నాడు. కాగా, ఆట పరిస్థితులు డిమాండ్ చేస్తే మాత్రం కవ్వింపులకు వెనకాడబోమని ఆసీస్ సారథి టిమ్‌పైన్ చెప్పాడు.
'గతంలో ఎంతో అవసరం అనుకున్నవి అంతగా ముఖ్యమైనవి కావని మహమ్మారి వల్ల ప్రజలు ఈ ఏడాది గ్రహించారు. జట్లు, ఆటగాళ్ల మధ్య కోపతాపాలు, పట్టింపులు, ఉద్రికత్తలు నిజంగా అర్థంలేనివి' అని విరాట్ అన్నాడు. అయితే ప్రతిసారీ దూకుడుతో పనిలేదని అవసరమైతే మాత్రం తమ ఆటగాళ్లు వెనకడుగు వేయరని పైన్ బదులిచ్చాడు. "ఆట పరంగా మైదానంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఆటగాళ్లకు ఎదురెళ్లడం, అతి దూకుడును ప్రదర్శించడం వంటివి ముందుగానే ప్లాన్ చేయరు. మొదట మా నైపుణ్యంతో బంతి, బ్యాటుతో ప్రణాళికలు అమలు చేస్తాం. అయితే మైదానంలో కొన్నిసార్లు పరిస్థితులు వేడెక్కుతాయి. అలాంటప్పుడు మాత్రం మేం వెనకడుగు వేయం" అని పైన్ అన్నాడు.