భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ రికార్డు బ్రేక్ చేయాలంటే మళ్లీ ఓ భారతీయుడే కావాలి. ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. విండీస్‌తో ఆదివారం జరిగిన రెండో వన్డేలో 120 పరుగులు చేశాడు విరాట్.ప్రపంచకప్‌లో వరుసగా 5 అర్ధశతకాలు చేసినా... ఒక్క శతకమైనా నమోదు చేయలేకపోయాడు. దాదాపు 11 ఇన్నింగ్స్‌ల తర్వాత శతకం సాధించి కసి తీర్చుకున్నాడు. ఈ ఒక్క శతకంతో కోహ్లీ పలు రికార్డులను బ్రేక్ చేశాడు.
ప్రపంచంలోని మూడు వన్డే జట్లపై ఎనిమిది, అంతకన్నా ఎక్కువ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ కొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఆసీస్, శ్రీలంక జట్లపై ఎనిమిదేసి శతకాలు బాదిన అతడు తాజాగా విండీస్‌పై ఈ ఘనత సాధించాడు. విరాట్ కన్నా ముందు మాస్టర్‌బ్లాస్టర్ సచిన్ ఆసీస్‌పై తొమ్మిది, శ్రీలంకపై ఎనిమిది శతకాలు సాధించాడు. ఫలితంగా సచిన్ రెండు జట్లపై 8 సెంచరీలు కొట్టిన రికార్డును బ్రేక్ చేశాడు. మూడు జట్లపై ఎనిమిది శతకాలు సాధించి గురువు అడుగుజాడల్లో నడుస్తున్నాడు.