తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కోహ్లీ, రోహిత్​ వన్డే స్వరూపాన్నే మార్చేశారు'

విరాట్​ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లు వన్డే క్రికెట్​ రూపురేఖలనే మార్చేశారని భారత జట్టు మాజీ కెప్టెన్​ ద్రవిడ్​ అభిప్రాయపడ్డారు. ఆధునిక కాలంలో తన స్ట్రైక్​రేట్​తో బ్యాటింగ్​ చేస్తే క్రికెట్లో కొనసాగడం కష్టమని తెలిపారు. మాజీ క్రికెటర్​ సంజయ్​ మంజ్రేకర్ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను వెల్లడించారు.

Kohli and Rohit have changed the ODI appearance: Rahul Dravid
'కోహ్లీ, రోహిత్​ వన్డే స్వరూపాన్నే మార్చేశారు'

By

Published : Jun 9, 2020, 7:52 PM IST

ఒకప్పటి తన స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేస్తే ఈనాటి క్రికెట్లో కొనసాగడం కష్టమని టీమ్‌ఇండియా మాజీ సారథి రాహుల్‌ ద్రవిడ్‌ అన్నారు. ప్రస్తుతం డిఫెన్సివ్‌ టెక్నిక్‌ విలువ తగ్గినప్పటికీ అవసరం మాత్రం తగ్గలేదన్నారు. కోహ్లీ, రోహిత్‌ వన్డేల స్వరూపాన్ని సమూలంగా మార్చేశారని ప్రశంసించారు. సుదీర్ఘ ఫార్మాట్‌కు ఛెతేశ్వర్‌ పుజారా వంటి ఆటగాళ్ల అవసరం ఎంతైనా ఉందని నొక్కిచెప్పారు. మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ నిర్వహించిన ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో వీడియోకాస్ట్‌లో ద్రవిడ్‌ తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

రాహుల్​ ద్రవిడ్​

అలసిపోయేలా చేసి..

"సుదీర్ఘ సమయం క్రీజులో పాతుకుపోయి బౌలర్లను అలసిపోయేలా చేయడం లేదా సంక్లిష్ట పరిస్థితుల్లో కొత్త బంతి మెరుపు పోగొట్టిన తర్వాత పరుగులు రాబట్టడమే నేను చేసింది. నా పనదే. దాన్ని చేసేందుకు గొప్పగా గర్వపడేవాడిని. అంటే.. వీరేంద్ర సెహ్వాగ్‌లాగా షాట్లు ఆడటం నాకిష్టం లేదని అర్థం కాదు. నా ప్రతిభ భిన్నమైంది. అంకితభావం, ఏకాగ్రతతో ఆడటమే నా నైపుణ్యాలు. నేను వాటిపైనే పనిచేశాను" అని ద్రవిడ్‌ అన్నారు. కెరీర్‌లో 'మిస్టర్‌ వాల్‌' 300కు పైగా వన్డేలు ఆడాడు. తన రోజుల్లో మాదిరిగా బ్యాటింగ్‌ చేస్తే ఇప్పుడు కొనసాగడం కష్టమేనని ఆయన అన్నారు.

"ఒకసారి స్ట్రైక్‌రేట్లు చూడండి. వన్డేల్లో నా స్ట్రైక్‌రేట్‌ సచిన్‌, సెహ్వాగ్‌ కన్నా తక్కువే ఉంటుంది. ఎందుకంటే ఆ రోజుల్లో స్థాయి అది. ఏదేమైనా నేను రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీతో పోల్చుకోలేను. ఎందుకంటే వారు వన్డేల స్వరూపమే మార్చేశారు. ఆటను సరికొత్త స్థాయికి తీసుకెళ్లారు. నిజం చెప్పాలంటే నేను టెస్టు ఆటగాడినే కావాలనుకున్నాను" అని ఆయన పేర్కొన్నారు.

వీరేంద్ర సెహ్వాగ్​తో రాహుల్ ద్రవిడ్​

డిఫెన్స్‌ ఎప్పటికీ కీలకం

క్రికెట్‌లో ఇప్పుడు భారీ స్కోర్లు నమోదవుతున్నాయి కానీ ద్రవిడ్‌ డిఫెన్స్‌ టెక్నిక్‌కు అప్పట్లో ఎంతో పేరుండేది. దాంతోనే కఠినమైన బౌలింగ్‌ స్పెల్స్‌ను ఆయన కాచుకొనేవారు. "ఇప్పుడు డిఫెన్స్‌ టెక్నిక్‌ విలువ తగ్గుతోంది. అయినప్పటికీ వికెట్‌ కాపాడుకోవాలంటే అది తెలియాలి. ఈ రోజుల్లో బతికేందుకు లేదా ఆటలో నిలదొక్కుకొనేందుకు టెస్టు ఫార్మాట్‌ అవసరం లేదు. డిఫెన్స్‌ టెక్నిక్‌ అవసరం లేకున్నా వన్డే, టీ20 ఫార్మాట్లలో కెరీర్‌ కొనసాగించొచ్చు. ఒక తరం ముందు ఆటలో కొనసాగాలంటే టెస్టు క్రికెటర్‌గా ఉండాల్సిందే. కోహ్లీ, విలియమ్సన్‌, స్మిత్‌ లాంటి వారి డిఫెన్స్‌ టెక్నిక్‌ ఇప్పటికీ ఎంతో బాగుంది" అని ద్రవిడ్‌ అన్నారు.

టెస్టుల్లో ఒత్తిడి వేరు

"ఆటలో సంక్లిష్ట పరిస్థితుల్లో కొనసాగేందుకు డిఫెన్స్‌ టెక్నిక్‌ సాయపడుతుంది. టెస్టు క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లు అదే పని చేస్తారు. ఇక ఒత్తిడి విషయానికి వస్తే టెస్టులను ఐదు రోజులు ఆడాలి. దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఇతర ఫార్మాట్లలో తప్పించుకోచ్చు. కానీ టెస్టుల్లో నువ్వెళ్లి కచ్చితంగా బ్యాటింగ్‌ చేయాల్సిందే. ఆ తర్వాత నీ సహచరులు, అవతలి జట్టు బ్యాటింగ్‌ చేయడం చూడాల్సిందే. ఇక ఆలోచించేందుకు చాలా సమయం ఉంటుంది. అందుకే పరిమిత ఓవర్ల క్రికెట్‌తో పోలిస్తే టెస్టుల్లో ఒత్తిడి మరో స్థాయిలో ఉంటుంది. బలహీనతలు ఉన్నప్పటికీ టీ20ల్లో కొనసాగొచ్చు. అదే టెస్టుల్లో మాత్రం నిలబడలేరు. టీ20ల్లో పరిమిత పాత్ర ఉంటుంది. దాన్ని పోషిస్తే సరిపోతుంది" అని మిస్టర్‌ వాల్‌ అభిప్రాయం.

యువతరం ఆసక్తి

"ప్రస్తుతం చాలామంది యువ ఆటగాళ్లు సైతం మూడు ఫార్మాట్లు ఆడాలని భావిస్తున్నారు. విరాట్‌ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వడం భారత్‌కు గొప్ప విషయం. అతనెప్పుడూ దాని గురించే మాట్లాడుతుంటాడు. యువ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. నేనెంతో మంది యువకులతో కలిసి పనిచేశాను. కోహ్లీ, విలియమ్సన్‌, స్మిత్‌ను ఆదర్శంగా తీసుకున్న వారు అన్ని ఫార్మాట్లు ఆడాలనే దృఢ నిశ్చయంతో ఉంటున్నారు. కానీ ప్రతిభ తక్కువగా ఉన్నవారు కోహ్లీ, పుజారా, రహానె వంటి ఆటగాళ్లున్న జట్టులో స్థానం పొందలేమని భావిస్తున్నారు. తెలుపు బంతి క్రికెట్‌ను మాత్రం బాగా సాధన చేస్తే ఐపీఎల్‌కు ఎంపికై జీవనోపాధి పొందగలమని ఆశిస్తున్నారు" అని ద్రవిడ్‌ వెల్లడించారు.

రాహుల్​ ద్రవిడ్​

పుజారాకు చోటు గ్యారంటీ

టీమ్‌ఇండియా నయావాల్‌ ఛెతేశ్వర్‌ పుజారాపై మాజీ క్రికెటర్​ ద్రవిడ్‌ ప్రశంసలు కురిపించారు. "అతడు సౌరాష్ట్ర నుంచి వచ్చాడు. ఇతర ఆటగాళ్లతో పోలిస్తే ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుందని చిన్నప్పట్నుంచే అతడికి నూరిపోశారు. పుజారా ప్రతి ఇన్నింగ్స్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే అతడు బ్యాటింగ్‌ చేస్తాడు. అన్ని షాట్లు అతడికి ఆడటం వచ్చు. స్పిన్‌ను చక్కగా ఎదుర్కొంటాడు. స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తాడు. తన ఆటపై పుజారా ఎంతో పట్టు సాధించాడు. శ్రమించాడు. అతడి ఏకాగ్రత కూడా తిరుగులేనిది. అలాంటి వ్యక్తికి కచ్చితంగా జట్టులో చోటు ఉంటుంది. ఎందుకంటే జట్టు విజయాల్లో అతడి టెక్నిక్‌ అత్యంత అవసరం" అని ఆయన అన్నారు.

ఇదీ చూడండి...'స్పిరిట్​ ఆఫ్​ క్రికెట్' జ్ఞాపకాన్ని షేర్​ చేసిన ఐసీసీ

ABOUT THE AUTHOR

...view details