తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ స్థానంలో అతడే సరైనోడు: గావస్కర్​ - ఆసీస్​తో టెస్ట్​ సిరీస్​కు కోహ్లీ దూరం

ఆస్ట్రేలియాతో టెస్ట్​ సిరీస్​కు టీమ్​ఇండియా సారథి కోహ్లీ దూరమైన నేపథ్యంలో.. ఆ స్థానంలో కేఎల్​ రాహుల్​కు చోటు దక్కాలని అభిప్రాయపడ్డాడు దిగ్గజ క్రికెటర్​ సునీల్​ గావస్కర్​. విరాట్​ లేకపోవడం ఆసీస్​కు కలిసొచ్చే అవకాశమని అన్నాడు. వీటితోపాటు పలు విషయాలను పంచుకున్నాడు.

Sunil Gavaskar
సునీల్​ గావస్కర్

By

Published : Nov 21, 2020, 6:28 AM IST

ఆస్ట్రేలియాతో చివరి మూడు టెస్టుల్లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గైర్హాజరీ భారత జట్టుపై ప్రభావం చూపుతుందని దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. కోహ్లి లేకపోవడం మానసికంగా ఆసీస్‌కు అతిపెద్ద సానుకూలాంశమని తెలిపాడు. ప్రస్తుత టీమ్‌ఇండియాలో ప్రతి ఒక్క ఆటగాడు కీలకమేనని.. సమష్టిగా సత్తాచాటితే 2018-19 ప్రదర్శన పునరావృతం చేయొచ్చని చెప్పాడు. కంగారూల గడ్డపై టీమ్‌ఇండియా మూడేసి వన్డేలు, టీ20లు.. నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడనున్న నేపథ్యంలో పర్యటనపై సునీల్‌ గావస్కర్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

గత పర్యటనలో పుజారా స్టార్‌గా నిలిచాడు. ఈసారి మెరిసే ఆటగాడు ఎవరనుకుంటున్నారు?

ఏ ఒక్కరి పేరో చెప్పడం నాకిష్టం లేదు. అందరూ కలిసికట్టుగా బాగా ఆడతారని అనుకుంటున్నా. ప్రతి ఒక్క ఆటగాడు కీలకంగా కనిపిస్తుండటం ఈసారి టీమ్‌ఇండియా ప్రత్యేకత. ప్రతి ఆటగాడికి ఒక బాధ్యత ఉంది. అది వారికి కూడా తెలుసు. నిజానికి ఈసారి పుజారాకు కాస్త కష్టమైన పరిస్థితే. రంజీ ట్రోఫీ ఫైనల్లో చివరిగా పుజారా బరిలో దిగాడు. అయితే కష్టపడేతత్వమే అతడికి అతిపెద్ద సానుకూలాంశం. క్రికెట్‌ మ్యాచ్‌లు లేకపోయినా ఆటకు పూర్తిగా దూరంగా ఉన్నాడని అనుకోను. బౌలింగ్‌ యంత్రం సహాయంతో సాధన చేసే ఉంటాడు. ఇండోర్‌ నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేసుండొచ్చు. ఆట పట్ల అతడి అంకితభావం, నిబద్ధత తిరుగులేనిది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతడు సత్తాచాటగలడు.

2018-19లో స్టీవ్‌ స్మిత్‌, వార్నర్‌లు ఆసీస్‌ జట్టులో లేరు. ఈసారి వాళ్లిద్దరు ఉండటం ఆసీస్‌కు కలిసొస్తుందా?

స్మిత్‌, వార్నర్‌లు జట్టులో చేరడం ఆసీస్‌కు అతిపెద్ద సానుకూలాంశం. గత పర్యటనలో బ్యాటింగ్‌లో ఆసీస్‌ ఘోరంగా విఫలమైంది. 4 టెస్టుల్లో ఒక్క బ్యాట్స్‌మెన్‌ కూడా సెంచరీ సాధించలేదు. మార్కస్‌ హ్యారిస్‌ చేసిన 79 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు. స్మిత్‌, వార్నర్‌ల అనుభవం.. ఆట ఆసీస్‌కు కొండంత బలం. వాళ్లిద్దరి చేరికతో కంగారూల బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్టంగా తయారైంది.

టెస్టుల్లో సాహా, రిషబ్‌ పంత్‌లలో ఎవరికి అవకాశం ఇవ్వాలి?

పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటే సాహాకే మొదటి ప్రాధాన్యం లభిస్తుంది. వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యం పరంగా అతడే అత్యుత్తమం. మిడిలార్డర్‌ బ్యాటింగ్‌ను మరింత బలోపేతం చేయాలనుకుంటే రిషబ్‌ పంత్‌ సరైనోడు. ఎడమచేతి వాటం కూడా కావడం అతడికి కలిసొచ్చే అంశం. వీరిద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలన్నది సవాలే.

అద్భుత ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయాల్సిందా?

ఐపీఎల్‌లో సూర్య అద్భుతంగా ఆడాడు. మంచి ఫామ్‌లో ఉన్నాడు. కానీ కొన్నిసార్లు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో చోటు సంపాదించడం చాలా కష్టమవుతుంది. ఒకప్పుడు ద్రవిడ్‌, సచిన్‌, లక్ష్మణ్‌, గంగూలీలతో మిడిలార్డర్‌ దుర్భేధ్యంగా ఉండేది. సుమారు పదేళ్ల వరకు ఆ నాలుగు స్థానాల్లో మరొకరికి అవకాశం రాలేదు. దేశవాళీ క్రికెట్లో సెంచరీలు, ద్విశతకాలు, ట్రిపుల్‌ సెంచరీలు కొట్టినా ప్రయోజనం లేకపోయింది. ఆ కాలంలో పుట్టడం దురదృష్టం అనుకోవాలి తప్ప మరేం చేయలేని పరిస్థితి. సూర్యకు మంచి భవిష్యత్తు ఉంది. ఇదే ఫామ్‌ కొనసాగిస్తే త్వరలోనే అవకాశం లభించొచ్చు.

సుదీర్ఘ కాలం బుడగలో ఉండటం ఆటగాళ్ల మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందా?

సుదీర్ఘ కాలం బయో బబుల్‌లో ఉండటం ఎవరికైనా కష్టమే. మానసికంగా ఆటగాళ్లకు ఇబ్బందే. పర్యటనల సమయంలో సరదాగా గడపడం ఆటగాళ్లకు అలవాటు. స్నేహితుల్ని కలవడం.. సినిమాలకు వెళ్లడం.. రెస్టారెంట్లకు తిరగడం.. వాకింగ్‌ చేయడం మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. బుడగ జీవితంలో ఇవేవీ సాధ్యం కావు. సిరీస్‌ల మధ్య కొంచెం సమయం ఉంటే ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని కలిస్తే ఆటగాళ్లు కాస్త ఉపశమనంగా ఉంటుంది. అలా కాకుండా ఒక బబుల్‌ నుంచి ఇంకో బుడగలోకి వెళితే ఇబ్బందులు తప్పవు. ఏదో ఒక సమయంలో ఆటగాళ్లలో చిరాకు మొదలవుతుంది. అప్పటికప్పుడు ఆ పరిస్థితిని అధిగమించి సాధారణ స్థితికి చేరుకోవడం కష్టమవుతుంది.

2018-19లో ఆస్ట్రేలియా గడ్డపై వన్డే, టెస్టు సిరీస్‌లు గెలిచి టీమ్‌ఇండియా చరిత్ర సృష్టించింది. మరోసారి ఆ ఘనత సాధ్యమేనా..?

ఈసారి కూడా భారత జట్టు మెరుగ్గా ఆడుతుందని ఆశిస్తున్నా. రెండేళ్ల క్రితం ఆడిన జట్టే ఇప్పుడూ బరిలో దిగుతోంది. అనుభవం, ఆత్మవిశ్వాసం జట్టులో కనిపిస్తున్నాయి. ఐపీఎల్‌ ప్రదర్శన ప్రకారం పరిమిత ఓవర్ల సిరీస్‌లలో టీమ్‌ఇండియాకు ఎదురు ఉండకపోవచ్చు. ఆ ఆత్మవిశ్వాసం టెస్టుల్లోనూ ప్రతిఫలిస్తుంది. భారత జట్టు సమతూకంగా ఉంది. మంచి బ్యాటింగ్‌ బృందం.. అద్భుతమైన స్పిన్‌ విభాగం.. అత్యున్నత స్థాయి పేస్‌ బౌలింగ్‌ జట్టుకు తిరుగులేని బలాలు. పేసర్లు కొత్త బంతితో అద్భుతాలు చేయగలరు. భారత క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ పేస్‌ విభాగం ప్రస్తుత టీమ్‌ఇండియా సొంతం. అంతా మంచి ఫామ్‌లో ఉన్నారు కూడా.

కోహ్లి మూడు టెస్టులకు అందుబాటులో ఉండకపోవడం టీమ్‌ఇండియాకు నష్టం చేస్తుందా?

కోహ్లి గైర్హాజరీతో టీమ్‌ఇండియాకు కచ్చితంగా నష్టమే. కాని అంతకంటే ఎక్కువగా ఆసీస్‌కు లాభం. మానసికంగా కంగారూలకు అది సానుకూలాంశం. టెస్టుల్లో ఆసీస్‌ గడ్డపై కోహ్లి ఆరు శతకాలు సాధించాడు. నాయకత్వ పటిమతో ఆకట్టుకున్నాడు. అతడి గైర్హాజరీ ఆసీస్‌ జట్టులో ఉత్సాహం నింపడం ఖాయం. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కోహ్లీకి ప్రత్యామ్నాయంగా కేఎల్‌ రాహుల్‌ కనిపిస్తున్నాడు. మయాంక్‌ అగర్వాల్‌, రోహిత్‌శర్మ ఇన్నింగ్స్‌ ఆరంభిస్తారు. నాలుగో నంబరుకు రాహుల్‌ బాగా సరిపోతాడు. ఐపీఎల్‌లో ఫామ్‌ ప్రకారం చూస్తే కోహ్లి స్థానంలో రాహులే సరైన ఆటగాడు.

బయో బబుల్‌ ఆటగాళ్లకే కాదు వ్యాఖ్యాతలకు తప్పలేదు. మీకేమనిపించింది?

ఐపీఎల్‌లో అదృష్టవశాత్తు బృందంగా పనిచేశాం. ఒకరి బాగోగులు మరొకొరం చూసుకున్నాం. మైదానానికి వెళ్లడం.. హోటల్‌కు తిరిగి రావడమంతా కలిసికట్టుగానే. వార్మప్‌ కోసం ఆటగాళ్లు మైదానంలో అడుగుపెట్టక ముందే పిచ్‌ రిపోర్ట్‌ అయిపోయేది. టాస్‌, బహుమతి ప్రదానోత్సవం సమయాల్లో తప్పితే వ్యాఖ్యాతలకు ఆటగాళ్లను కలిసే అవకాశమే లేదు. కామెంట్రీ బాక్సు నుంచి ఆటగాళ్లను చూసేవాళ్లం. అలవాటు లేని పని. కొంచెం కష్టంగా అనిపించినా తప్పలేదు. హోటల్‌ సిబ్బంది బాగా చూసుకున్నారు. మాకు బోర్‌ కొట్టకుండా ప్రతి రోజూ డైనింగ్‌ మార్చేవారు. భిన్న ప్రాంతాల్లో డైనింగ్‌ ఏర్పాటు చేశారు. ప్రతి సాయంత్రాన్ని ఆహ్లాదంగా మలిచారు.

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా రోహిత్‌శర్మ ఘనత.. టీమ్‌ఇండియాకు భిన్న సారథుల చర్చను లేవదీసింది. దీనిపై మీరేమంటారు?

భిన్న సారథ్యంపై సెలెక్షన్‌ కమిటీ నిర్ణయం తీసుకోవాలి. ఆస్ట్రేలియా పర్యటన కోసం విరాట్‌ను కెప్టెన్‌గా.. రహానెను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ పర్యటన వరకు మార్పులు ఉండకపోవచ్చు. పర్యటన ముగిసిన తర్వాత సెలెక్షన్‌ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. వాళ్ల ఆలోచన పర్యటన తర్వాతే తెలుస్తుంది.

ఇదీ చూడండి :ఐపీఎల్​ 2020: ఆ విషయంలో విరాట్​ కోహ్లీ టాప్​

ABOUT THE AUTHOR

...view details