న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్ సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉంటాడు. సరదా ట్వీట్లతో సందడి చేస్తుంటాడు. తాజాగా టీమిండియా బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. బుధవారం జరిగిన చివరి వన్డేలో భారత్‌పై న్యూజిలాండ్ అయిదు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో రాహుల్ (112) శతకంతో మెరిశాడు. అయితే 20వ ఓవర్‌లో రాహుల్ సింగిల్ కోసం ప్రయత్నించగా నీషమ్ అతడికి ఎదురుగా వచ్చాడు. ఫలితంగా రాహుల్ కాస్త ఇబ్బంది పడ్డాడు. అయినా తర్వాత వెంటనే ఇద్దరూ నవ్వుకొన్నారు.
మ్యాచ్ ముగిసిన అనంతరం నీషమ్ దీనిపై ట్వీట్ చేశాడు. "రాహుల్ కాస్త పరుగులు దాచుకో. ఏప్రిల్‌లో మరిచిపోకుండా సాధించు" అని ట్వీట్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత మ్యాచ్ మధ్యలో వారు ఎదురుపడిన ఫొటోని జత చేస్తూ మరో ట్వీట్ చేశాడు. ‘‘పేపర్, సిజర్స్, రాక్’’ అంటూ నవ్వుతున్న ఎమోజీలను పెట్టాడు. దీనికి రాహుల్ స్పందించాడు. "ఏప్రిల్‌లో దీనిని పరిష్కరించుకుందాం. త్వరలోనే కలుద్దాం" అని అన్నాడు.