తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కేఎల్‌ రాహుల్‌ టెస్టుల్లో సుదీర్ఘ కాలం ఆడగలడు.. కానీ'

టీమ్​ఇండియా క్రికెటర్ కేఎల్​ రాహుల్​ టెస్టు క్రికెట్లో సుదీర్ఘ కాలం ఆడగలడని అభిప్రాయపడ్డాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. ఈ ఏడాది ఐపీఎల్​లో పంజాబ్​ కెప్టెన్​గా రాహుల్​ అదరగొట్టాడని ప్రశంసించాడు.

kl rahul
కేఎల్‌ రాహుల్

By

Published : Nov 8, 2020, 8:04 AM IST

టీమ్​ఇండియా యువ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ టెస్టు క్రికెట్లో చాలాకాలం ఆడతాడని అన్నాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. అతడికి ఆ సత్తా ఉందని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో నాయకత్వంతో ఆకట్టుకున్నాడని వెల్లడించాడు.

కేఎల్‌ రాహుల్‌ టెస్టుల్లో సుదీర్ఘ కాలం ఆడగలడు. ఒక క్రికెటర్‌గా ఈ మాట చెబుతున్నా. ఎవరిని ఆడించాలి? ఎవరు వద్దో నిర్ణయించేది మాత్రం సెలక్టర్లే. రాహుల్‌ పరుగులు చేసినా ఆ జట్టు ఓడిపోవడం బాధాకరం. కానీ అతడు అన్ని ఫార్మాట్లలో పరుగులు చేయగలడు. టీమ్‌ఇండియా గెలుపు కోసం అతడు పరుగులు చేయాలని కోరుకుంటున్నా

-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు.

సేనా (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) దేశాల్లో టీమ్‌ఇండియా మెరుగ్గా రాణించాల్సి ఉందని గంగూలీ అన్నాడు. అక్కడ జట్టు ఆటతీరును మెరుగు పర్చేందుకు ఏం చేయాలో విరాట్‌ కోహ్లీ ఆలోచించాలని సూచించాడు. ఆస్ట్రేలియాలో సిరీస్‌ గెలిచినప్పటికీ దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్​లో మ్యాచులు గెలవాల్సిందని చెప్పాడు.

టీమ్‌ఇండియా ఏమైనా చేయగలదు. వారికా సత్తా ఉంది. అయితే అందరూ సరిగ్గా బ్యాటింగ్‌ చేయాలి. కోహ్లీ, పుజారాను మినహాయిస్తే ఇంగ్లాండ్‌లో మరెవరూ శతకాలు చేయలేదు కాబట్టే ఓడిపోయాం. కానీ ఆస్ట్రేలియాలో పుజారా 500 పరుగులు చేయడం, విరాట్‌, పంత్‌ శతకాలు చేయడంతో గెలిచాం. సిరీసులు గెలిచేది ఇలాగే. కమిన్స్‌, స్టార్క్‌, హేజిల్‌వుడ్‌, లైయన్‌ మంచి బౌలర్లు. వారు తీవ్రంగా పోరాడతారు. మనకూ బుమ్రా, షమి, ఇషాంత్‌, యువకులైన సైని, సిరాజ్‌ వంటి బౌలర్లు ఉన్నారు. స్పిన్నర్లతో కలిపి ఎవరినెలా ఉపయోగించుకోవాలన్నది కోహ్లీ నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది

-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు.

ఐపీఎల్​ పూర్తవగానే నవంబర్‌ 11న ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరుతుంది టీమ్​ఇండియా. వరుసగా 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్టులు ఆడనుంది. ఆసీస్‌తో తొలిసారి డే/నైట్‌ టెస్టులో తలపడనుంది. డిసెంబర్‌ 17-21 వరకు అడిలైడ్‌లో ఈ పోరు జరుగుతుంది. ఆ తర్వాత టెస్టులకు మెల్‌బోర్న్‌ ( డిసెంబరు 26-30), సిడ్నీ (జనవరి 7-11, 2021), బ్రిస్బేన్‌ (జనవరి 15-19) ఆతిథ్యమిస్తాయి.

ఇదీ చూడండి : ఐపీఎల్: వాళ్లిద్దరి దగ్గరే ఆరెంజ్, పర్పుల్ క్యాప్

ABOUT THE AUTHOR

...view details