కరోనా ముప్పు వల్ల మునుపటిలా ఆడతానో లేదోనని బెంగపడినట్లు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సారథి కేఎల్ రాహుల్ అన్నాడు. లాక్‌డౌన్‌లో రాత్రుళ్లు పీడ కలలు వెంటాడాయని తెలిపాడు. చాలాకాలం తర్వాత బ్యాటు పట్టుకున్న తనకు మొదటి సెషన్ ఇబ్బందికరంగా సాగిందని పేర్కొన్నాడు. మూడో సెషన్ తర్వాత సౌకర్యంగా అనిపించిందని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం ఐపీఎల్-2020 కోసం రాహుల్ దుబాయ్‌కి వెళ్లాడు. పంజాబ్ జట్టు ఏర్పాటు చేసిన శిబిరంలో ఉన్నాడు. టీమ్‌ఇండియా తరఫున బహుముఖ పాత్రల్లో ఒదిగిన రాహుల్.. ఇప్పుడు సారథ్యమూ చేపట్టాడు. తనకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించాలని పట్టుదలతో ఉన్నాడు. ఇటీవలే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
"లాక్‌డౌన్‌లో కొన్ని రాత్రుళ్లు పీడకలలు వేధించాయి. ఆందోళనగా నిద్రలేచేవాడిని. లైన్ అండ్ లెంగ్త్‌ను అందిపుచ్చుకోకుంటే ఏమౌతుందో? జిడ్డుగా మారితే ఎలా? ఇంతకుముందులా నా కవర్‌డ్రైవ్ అందంగా లేకపోతే? ఇలాంటి ప్రశ్నలన్నీ ఆలోచించేవాడిని. బ్యాటు పట్టిన తొలి సెషనూ నాకు సాయపడలేదు. దాంతో నా భయాలన్నీ నిజమవుతాయా అని కలవరపడ్డాను. నెట్స్‌లో ఘోరంగా బ్యాటింగ్ చేశాను. మూడు సెషన్ల తర్వాత సౌకర్యంగా అనిపించింది. దాంతో సంతోషించా"
కేఎల్ రాహుల్, టీమ్‌ఇండియా క్రికెటర్
తనకు ఎదురయ్యే ప్రతి సవాల్‌ను ఆస్వాదిస్తానని చెప్పాడు కేఎల్. వికెట్ కీపింగ్ చేయడం తనకిష్టమని.. మధ్యలో ఉండి మైదానంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చని పేర్కొన్నాడు. "ఏడెనిమిది నెలలుగా నాకు వచ్చిన ఎదురైన ప్రతి సవాల్‌ను ఆస్వాదించా. వేర్వేరు పాత్రల్లో ఒదిగిపోవడం, బ్యాటింగ్‌లో ఏ స్థానంలోనైనా రావడాన్ని ఆనందించా. జట్టు ఏ అవసరం ఉన్నా తీరుస్తాను" అని రాహుల్ చెప్పాడు.
వాళ్ల సారథ్యంలో చాలా పాఠాలు..
మరోవైపు సారథ్యం విషయంలో ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్‌శర్మల నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పాడు కేఎల్ రాహుల్.
"నిజానికి నేనెప్పుడూ కెప్టెన్‌లా ఆలోచిస్తూనే ఆడతా. ఫలానా సందర్భంలో నేనైతే ఏం చేస్తాను? ఎవరితో బౌలింగ్ చేయిస్తాను? వంటి ఆలోచనలు మెదులుతూనే ఉంటాయి. దానికి కొనసాగింపే సారథ్యం. కెప్టెన్సీ విషయంలో ఎలాంటి అంచనాలు పెట్టుకోవట్లేదు. ధోనీ, విరాట్, రోహిత్‌ల సారథ్యం నుంచి చాలా నేర్చుకున్నా. ధోనీ ప్రశాంతత, మ్యాచ్ విన్నర్లపై అతడు చూపించే నమ్మకం నాకెంతో ఇష్టం. కోహ్లీ జట్టును ముందుండి నడిపిస్తాడు. జట్టులోని ఆటగాళ్లంతా ఇంకా ఇంకా మెరుగవ్వాలని కోరుకుంటాడు. రోహిత్ ఇష్టంతో ఆడతాడు. ఆటగాళ్లకు అండగా నిలుస్తాడు. ధోని రైటైర్మెంట్ గురించి తెలియగానే అందరిలాగే భావోద్వేగానికి గురయ్యా. అతడితో కలిసి మరికొంత కాలం క్రికెట్ ఆడాలనుకున్నాం. డ్రెస్సింగ్ రూమ్‌లో ధోని ప్రశాంతత వెలకట్టలేనిది" అని రాహుల్ అన్నాడు.