తెలంగాణ

telangana

ETV Bharat / sports

వివాదం, ప్రేమ.. రాహుల్​లో మార్పు తెచ్చాయా?

టీమిండియాలో ప్రస్తుతం అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శిస్తున్న బ్యాట్స్​మెన్​ కేఎల్​ రాహుల్​. ఏడాది క్రితం పేలవమైన ఆటతీరుతో, నిర్లక్ష్యంగా ఔట్​ అవుతూ కనిపించేవాడు. కాని కాలం అతడిని మార్చేసింది. తోటి ఆటగాళ్లు విఫలమవుతున్నా నిలకడైన ఫామ్​ నిరూపించుకొంటూ భారత జట్టుకు వెన్నెముకలా నిలుస్తున్నాడు. అసలు ఈ మార్పునకు కారణమేంటి..?

KL Rahul Change  in mindset  because of Love and TV Show Issue?
వివాదం, ప్రేమ.. రాహుల్​లో మార్పు తెచ్చాయా.?

By

Published : Feb 13, 2020, 8:40 AM IST

Updated : Mar 1, 2020, 4:24 AM IST

గతంలో కేఎల్‌ రాహుల్‌ పేరెత్తగానే "ప్రతిభావంతుడే కానీ.." అని అందరిలోనూ ఓ నిట్టూర్పు! మేటి బ్యాట్స్‌మన్‌గా నిలిచే సత్తా ఉన్నప్పటికీ.. ఎన్నో అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. నిలకడైన ఆటతీరు లేక జట్టులో స్థానం కోల్పోయే పరిస్థితీ వచ్చింది. కానీ ఇప్పుడు అదే రాహుల్‌ జట్టులో ఓ బలం. అతడు మైదానంలో ఉంటే అభిమానులకు ఆశాకిరణం. ఓపెనింగ్‌ మొదలు ఏ స్థానంలో అయినా బ్యాటింగ్​ చేయగల సమర్థుడిగా పేరు తెచ్చుకున్నాడు. టెయిలెండర్ల సహాయంతో ఇన్నింగ్స్​ నడిపించగల నేర్పరితనం సొంతం చేసుకున్నాడు. ఇక ధోనీ లేని లోటు తీరుస్తూ వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలూ నిర్వర్తిస్తున్నాడు. స్వదేశంలోనే కాకుండా విదేశీ గడ్డపైనా అదరగొట్టేస్తున్నాడు. మేటి ఆటగాళ్లకు దీటుగా రాణిస్తూ జట్టులో కీలక ఆటగాడిగా మారాడతను. ఏడాది వ్యవధిలో రాహుల్‌లో వచ్చిన మార్పు అనూహ్యం. ఇందుకు కారణాలివేనా!

కేఎల్​ రాహుల్​

ఏడాది క్రితం ఓ వివాదం..

సరిగ్గా ఏడాది వెనక్కి వెళ్తే రాహుల్‌ పరిస్థితి దయనీయం! అసలే పేలవ ఫామ్‌, నిలకడ లేమితో సతమతం అవుతున్న అతడు.. ఒక టీవీ షోలో వివాదాస్పద వ్యాఖ్యలతో ఇబ్బందులు పడ్డాడు. దాని వల్ల కొన్ని మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కొన్నాడు. ఫలితంగా జట్టులో చోటు ప్రశ్నార్థకంగా మారి కెరీర్‌పైనే నీలి నీడలు కమ్ముకున్నాయి. అతడి ప్రపంచకప్‌ కలలు భగ్నమైనట్లే కనిపించింది. ఇక అతడి కథ ముగిసినట్లే అన్న నిర్ణయానికి వచ్చేశారు చాలామంది! కానీ అక్కడే కథ మలుపు తిరిగింది.

కరణ్​ షోలో రాహుల్​

>>టీవీ షో వివాదం కారణంగా అప్పట్లో రాహుల్‌ చాలా బాధ పడ్డాడు. నిజానికి ఆ వివాదంలో చిక్కుకున్నందుకు అతడు సంతోషించాలి. ఈ గొడవ వల్ల వచ్చిన చెడ్డ పేరుతో రాహుల్‌లో కదలిక వచ్చింది. తనపై పడ్డ మచ్చను చెరిపేయడానికి ఆటే మార్గమని అతను భావించాడు. కెరీర్లో అప్పటిదాకా నిర్లక్ష్యంగా ఆడే ఈ క్రికెటర్​.. ఈ వివాదం తర్వాత జాగ్రత్తగా ఆడటం మొదలుపెట్టాడు. అతడిలో ఎక్కడలేని కసి, పట్టుదల కనిపించాయి.

>> ప్రపంచకప్‌లో ధావన్‌ గాయపడి పలు టోర్నీలకు దూరమవడం వల్ల ఇతడికి ఓపెనింగ్‌ చేసే అవకాశం వచ్చింది. వాటిని కాపాడుకొంటూ తన సహజ శైలిని వీడి రక్షణాత్మకంగా ఆడటం మొదలుపెట్టాడు. జట్టుకు మంచి ఆరంభాలిచ్చాడు. బంగ్లాపై 77 పరుగులు చేశాడు. శ్రీలంకపై సెంచరీ కొట్టాడు. ప్రపంచకప్‌ ప్రదర్శనతో ఆత్మవిశ్వాసం కూడగట్టుకున్న ఈ క్రికెటర్​.. అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. గత ఆరేడు నెలలుగా రాహుల్‌ పరుగుల ప్రవాహం నిరాటంకంగా సాగుతోంది. ధావన్‌ ఫిట్‌నెస్‌ సమస్యలు, ఫామ్‌ లేమి.. రాహుల్‌కు కలిసొచ్చాయి. కొన్ని మ్యాచ్‌లకు రోహిత్‌ కూడా అందుబాటులో లేకపోవడం వల్ల వరుసగా ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశం దక్కింది. ప్రపంచకప్‌ తర్వాత వెస్టిండీస్‌ పర్యటన మొదలుకుని.. ప్రస్తుత న్యూజిలాండ్‌ సిరీస్‌ వరకు రాహుల్‌ నిలకడగా రాణిస్తున్నాడు.

>>వన్డేలు, టీ20ల్లోనూ కెరీర్‌ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేస్తున్నాడు కేఎల్​. జట్టులో మేటి బ్యాట్స్‌మెన్‌ అయిన కోహ్లీ, రోహిత్‌లకు దీటుగా అతడి ప్రదర్శన ఉండటం విశేషం. వివిధ సిరీస్‌ల్లో మేటి బౌలర్లను అతను అలవోకగా ఎదుర్కొన్న తీరు రాహుల్‌ సామర్థ్యాన్ని చాటి చెబుతుంది. విదేశీ గడ్డపై ద్రవిడ్​ తర్వాత శతకం చేసిన రెండో భారత కీపర్​గా ఘనత సాధించాడు.

దేనికైనా రెడీ..

ప్రస్తుతం భారత పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్లలో రాహుల్‌ బహుముఖ పాత్ర పోషిస్తున్నాడు. ఫలానా స్థానంలో ఆడతా.. ఈ పనే చేస్తా అనే పరిమితులేమీ అతడికి లేవు. ఓపెనింగ్‌లో ఆడటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటున్నాడు. ఆ స్థానం నుంచి మిడిలార్డర్‌కు మారిస్తే అతనేమీ సమస్యగా భావించట్లేదు. అక్కడా స్థిరంగా రాణిస్తున్నాడు.

>> న్యూజిలాండ్‌ పర్యటన సందర్భంగా టీ20ల్లో అతను ఓపెనర్‌గా ఎంత గొప్పగా ఆడాడో.. వన్డేల్లో మిడిలార్డర్‌కు మార్చినా అంతే నిలకడగా రాణించాడు. రోహిత్‌, ధావన్‌ ఇద్దరూ ఈ సిరీస్‌కు అందుబాటులో లేకపోగా.. రాహుల్‌ను మిడిల్‌కు పంపించి పృథ్వీ, మయాంక్‌లను ఓపెనర్లుగా ఆడించింది జట్టు యాజమాన్యం.మిడిలార్డర్లోనూ రాహుల్​ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ప్రపంచకప్‌ కోసం టీ20ల్లో మాత్రమే రాహుల్​ కీపర్​ పాత్ర పోషిస్తాడనుకున్నారు. కానీ వన్డేల్లోనూ అతడు ఈ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తు ఔరా అనిపించుకుంటున్నాడు.

ఆ ఇద్దరి తర్వాత 'మ్యాచ్​ విన్నర్​'..

యువరాజ్‌, రైనా లాంటి ఆటగాళ్లు నిష్క్రమించాక.. ధోని జోరు తగ్గాక.. భారత బ్యాటింగ్‌లో మ్యాచ్‌ విన్నర్లు తగ్గిపోయారు. ఒంటి చేత్తో మ్యాచ్‌లు గెలిపించగల ఆటగాళ్లు ఎవరా అని చూస్తే కోహ్లీ, రోహిత్‌ మాత్రమే కనిపిస్తున్నారు. ధావన్‌ అప్పుడప్పుడూ మ్యాచ్‌ విన్నర్‌ పాత్ర పోషించినా.. నిలకడ లేమి అతడికి సమస్య. అతను అన్ని రకాల పిచ్‌ల మీదా ఆడలేడు. ఇక మిగతా బ్యాట్స్‌మెన్‌కు జట్టులో స్థానం నిలుపుకోవడమే కష్టమవుతుంటే మ్యాచ్‌ విన్నర్‌ పాత్ర ఎలా పోషిస్తారు?

రాహుల్​ బ్యాటింగ్​

ఇలాంటి సమయంలో రాహుల్‌ రూపంలో భారత్‌కు ఇప్పుడో హీరో దొరికాడు. కోహ్లీ, రోహిత్‌ల తర్వాత భారీ ఇన్నింగ్స్‌లు ఆడగల, ఏ స్థితిలో అయినా నిలబడి మ్యాచ్‌లు గెలిపించగల సత్తా రాహుల్‌లోనే కనిపిస్తోందిప్పుడు. గత కొన్ని నెలల్లో రాహుల్‌ నాణ్యమైన ఇన్నింగ్స్‌ చాలానే ఆడాడు. వివిధ జట్లపై, భిన్న పరిస్థితుల్లో సత్తా చాటాడు. న్యూజిలాండ్‌ పర్యటనలో అతడి బ్యాటింగ్‌ మరో స్థాయికి చేరుకుంది. ఈ జోరు, నిలకడ మున్ముందు ఏమేర కొనసాగిస్తాడన్న చూడాలి. కానీ ఇప్పటికైతే రాహుల్‌ రూపంలో టీమిండియాకు మరో 'మ్యాచ్‌ విన్నర్‌' దొరికినట్లే!

ప్రేమ వల్లేనా..?

కేఎల్ రాహుల్​లో మార్పునకు ప్రేమ కూడా కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్​ నటి అతియా శెట్టితో ఈ క్రికెటర్​ డేటింగ్​లో​ ఉన్నాడంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి పార్టీలు చేసుకున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యాయి. రాహుల్​కు కష్టసమయంలోనూ పక్కనే ఉంటూ ఈ అమ్మడు చాలా మద్దతుగా నిలిచినట్లు సన్నిహితుల సమాచారం. అందుకే రాహుల్​ విజయంలో లవ్​ ఓ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

రాహుల్​ పక్కనే అతియా
Last Updated : Mar 1, 2020, 4:24 AM IST

ABOUT THE AUTHOR

...view details