తెలంగాణ

telangana

ETV Bharat / sports

రాహుల్​ను ఇలా ఉపయోగించడం సరైందేనా! - cricket news

భారత్​ తరఫున ప్రస్తుతం పరిమిత ఓవర్ల ఫార్మాట్​లో కేఎల్ రాహుల్ కీపింగ్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ విషయంపై సమ్మతిస్తుండగా, మరికొందరు ఇది సరికాదంటున్నారు.

రాహుల్​ను ఇలా ఉపయోగించడం సరైందేనా!
కేఎల్ రాహుల్

By

Published : Jan 22, 2020, 8:10 AM IST

Updated : Feb 17, 2020, 11:01 PM IST

రాహుల్‌ ద్రవిడ్‌.. గోడ లాంటి బ్యాట్స్‌మన్‌! అద్భుతమైన స్లిప్‌ ఫీల్డర్‌! అంతేకాదు ఉపయోగకరమైన వికెట్‌కీపర్‌! ఒకప్పుడు ద్రవిడ్‌ను అన్ని రకాలుగా టీమ్‌ఇండియా ఉపయోగించుకుంది. ముఖ్యంగా ఈ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ను 70 వన్డేలకుపైగా వికెట్‌కీపర్‌గా వాడుకుంది. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత మరో కర్ణాటక ఆటగాడు కేఎల్‌ రాహుల్‌.. ద్రవిడ్‌ బాటలోనే ఉన్నాడు. అతని పేరూ రాహులే! ఓపెనర్‌గా, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా కాక ఇప్పుడు వికెట్‌కీపర్‌గానూ అవతారం ఎత్తాడు. అయితే రాహుల్‌ను ఇలా ఉపయోగించుకోవడం ఎంత వరకు సమంజసం అనే చర్చ నడుస్తోందిప్పుడు!

రాహుల్‌ ద్రవిడ్‌ వికెట్‌కీపర్‌గా అవతారం ఎత్తినప్పుడు అప్పటి పరిస్థితులు వేరు. రెగ్యులర్‌ కీపర్‌ నయన్‌ మోంగియా రిటైర్‌ అయిన తర్వాత కొంతమంది కీపర్లను ప్రయత్నించినా ఫలితం లేకపోవడం వల్ల జట్టు అవసరాల కోసం ద్రవిడ్‌ కీపింగ్‌ బాధ్యతలు తలకెత్తుకున్నాడు. 2003 ప్రపంచకప్‌తో సహా ఏకంగా రెగ్యులర్‌ కీపర్‌ స్థాయిలో 70 వన్డేలకు పైగా కీపింగ్‌ చేశాడు. ప్రత్యామ్నాయాలు లేకపోవడం వల్ల అయిష్టంగానే ద్రవిడ్‌ ఆ బాధ్యతలు నిర్వర్తించాడు. ఇప్పుడు కేఎల్‌ రాహుల్‌.. ద్రవిడ్‌ మాదిరే జట్టు కోసం కొత్త పాత్రకు సిద్ధమయ్యాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో రెండో వన్డేలో 52 బంతుల్లో 80 పరుగులు చేసిన ఈ కుర్రాడు.. ఫించ్‌ను మెరుపు స్టంపింగ్‌ చేయడం సహా రెండు క్యాచ్‌లు పట్టి ఆకట్టుకున్నాడు.

అతడికి ఇప్పటికే ఐపీఎల్‌లో వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా ఆడిన అనుభవం ఉన్నప్పటికీ.. అతడ్ని రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌గా కొనసాగించాలన్న ఆలోచన పైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ద్రవిడ్‌ కీపర్‌గా చేసిన ఆనాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ప్రతిభావంతులైన వికెట్‌కీపర్లకు కొదవ లేదు. అయినా కేఎల్‌ రాహుల్‌ను కీపర్‌ బ్యాట్స్‌మన్‌గానే కొనసాగిస్తామని ఆస్ట్రేలియాతో సిరీస్‌ గెలిచాక కెప్టెన్‌ కోహ్లీ చెప్పడం దేనికి సంకేతం? పైగా ఓపెనర్‌గా, మిడిలార్డర్‌లో రాణించి మంచి ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ను సమతూకం పేరిట కొత్త బాధ్యతలు అప్పగించడం ఎంత వరకు సరైంది?

ఫించ్​ను మెరుపు స్టంపింగ్​ చేస్తున్న కేఎల్ రాహుల్

కీపర్‌ రిషబ్‌ పంత్‌ కుర్రాడు.. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నాడు. అతణ్ని రాటుదేల్చాల్సింది పోయి అతడి బాధ్యతలు ప్రధాన బ్యాట్స్‌మెన్‌లో ఒకడైన రాహుల్‌కు అప్పగించడం ఎందుకనేది మాజీల మాట. పంత్‌ గాయపడడం వల్ల అతని స్థానంలో రాహుల్‌ తాత్కాలికంగా కీపింగ్‌ చేసినంత వరకూ పర్వాలేదు. రాబోయే సిరీస్‌లలోనూ అతణ్ని ఇదే పాత్ర పోషించమంటే.. పంత్‌ పరిస్థితి ఏంటి? 50 ఓవర్ల పాటు కీపింగ్‌ చేసి మళ్లీ టాప్‌ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేయమంటే ఎవరికైనా కష్టమేనని మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా అంటున్నాడు. టీ20ల్లో అయితే ఫర్వాలేదు కానీ వన్డేల్లో రాహుల్‌ను శాశ్వత వికెట్‌కీపర్‌గా చేయకూడదని మాజీ కీపర్‌ మోంగియా అంటున్నాడు.

అయితే రాహుల్‌ను కీపర్‌గా ఉపయోగించుకోవడం వల్ల అదనపు బ్యాట్స్‌మన్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంటుందని.. ఇది జట్టు సమతూకాన్ని పెంచుతుందనేది కెప్టెన్‌ కోహ్లీతో పాటు కొంతమంది మాట. రాహుల్‌ను రెగ్యులర్‌ కీపర్‌గా వాడుకుంటే ఒకేసారి ఇద్దరు ఆల్‌రౌండర్లనూ ఆడించొచ్చనేది మరో వ్యూహం! అవసరాన్ని బట్టి టాప్‌ఆర్డర్‌, మిడిలార్డర్లో ఎక్కడైనా రాహుల్‌ను దింపొచ్చని జట్టు భావిస్తోంది. మరి భవిష్యత్‌లో కీపింగ్‌ భారాన్ని మోస్తూ.. బ్యాటింగ్‌లోనూ అతను ఇదే జోరు ప్రదర్శించగలడా అన్నదే సందేహం!

Last Updated : Feb 17, 2020, 11:01 PM IST

ABOUT THE AUTHOR

...view details