శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ అద్భుతం చేశాడు. కీరన్ రెండు ప్రత్యేక వికెట్లు సాధించాడు. ఇరు జట్ల మధ్య గత రాత్రి జరిగిన తొలి వన్డేలో లంక తొలుత బ్యాటింగ్ చేసి 49 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టుకు ఓపెనర్లు ఎవిన్ లూయిస్(65; 90 బంతుల్లో 4x4, 2x6), షై హోప్(110; 133 బంతుల్లో 12x4, 1x6) శుభారంభం చేయగా, చివర్లో బ్రావో(37; 47 బంతుల్లో 2x4, 1x6) రాణించాడు. రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన విండీస్.. 47 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో 8 వికెట్ల తేడాతో కరీబియన్ జట్టు ఘన విజయం సాధించింది.
కళ్లు చెదిరే క్యాచ్..
అయితే, టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు మంచి శుభారంభం దక్కింది. ఓపెనర్లు గుణతిలక(55; 61 బంతుల్లో 7x4), కరుణరత్నె(52; 61 బంతుల్లో 4x4) తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న వీరిని పొలార్డ్ స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేర్చాడు. తొలుత అతడు వేసిన 19.2 ఓవర్‌లో కరుణరత్నె షాట్ ఆడగా బంతి బౌలర్ కుడివైపు నుంచి వెళ్లింది. దాంతో వెంటనే స్పందించిన పొలార్డ్ తన కుడిచేతిని చాచి క్యాచ్ పట్టడానికి యత్నించాడు. అయితే బంతి చేతికి తగిలి గాల్లోకి లేచింది. అలాగే కష్టపడి ముందుకెళ్లి ఒంటి చేత్తో ఆ బంతిని ఒడిసిపట్టాడు. దాంతో లంక తొలి వికెట్ కోల్పోయింది.